ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత
తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రి వచ్చేలోపే ఆయన కన్నుమూశారని వైద్యులు వెల్లడించారు. 
 
రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నడమ్మా అనే మనిషి గీతంతో ఆయన పేరు మార్మోగిపోయింది. పాఠశాలకు వెళ్లకుండానే ఆయన కవిగా రాణించారు. కాకతీయ యూనివర్సిటీ ఆయనను డాక్టరేట్ తో సత్కరించింది. 
 
2014లో అకాడ మి ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ డాక్ట రేట్‌ పొందారు. 2015లో దాశ రథి సాహితి పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితి పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కరం, లోక్‌నాయక్‌ పురస్కారం ఆయనను వరించాయి.  2006లో గంగా సినిమాలో గీత రచయితగా ఆయనకు నంది అవార్డు కూడా వరించింది.
 
1961, జూలై 18న ఉమ్మడి వరంగల్‌ జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో (ప్రస్తుతం సిద్దిపేట జిల్లా) అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లన్న. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమై పోతున్నడమ్మ మనిషన్నవాడు’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అశువు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ.. ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు.
 
అందె శ్రీ చిన్నప్పుడు భూస్వాముల దగ్గర గొర్రెల కాపరిగా పనిచేశాడు. అక్షర ముక్క రాకుండానే అందె శ్రీ తన కళాఖండాలతో తెలుగు ప్రజల హృదయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన గీతాలను రాష్ట్రవ్యాప్తంగా పాడుతున్నారు. వాటిలో చాలా వరకు తెలుగు సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించాయి.  పల్లె నీకు వందనములమ్మో, మాయమై పోతున్నదమ్మా.. మనిషన్నవాడు, గల గలా గజ్జలబండి, కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే గేయాలను రచించారు.
 
ఆయన మృతి ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనంగా మార్చి ప్రజల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపచేసిన గొప్ప యోధుడు అని అందెశ్రీ ప్రశంసించారు.   తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిపారు.అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.
 
తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో సమాజంలోని అన్ని వర్గాలను కదిలించి ఉద్యమం వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించించిన గొప్ప వ్యక్తి అందెశ్రీ అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.  “అందెశ్రీ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన అరుదైన కవి. తెలంగాణ ఉద్యమ దశలో ప్రజల్లో ఆత్మగౌరవ స్పూర్తిని రగిలించిన ఆయన రచనలు చిరస్మరణీయo. అందెశ్రీ గారి మరణవర్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు.