కాంగ్రెస్ అంటేనే ముస్లింలు.. రేవంత్ వ్యాఖ్యలు ప్రమాదకరం

కాంగ్రెస్ అంటేనే ముస్లింలు.. రేవంత్ వ్యాఖ్యలు ప్రమాదకరం
కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటూ  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రమాదకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్  హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఓ సభలో బహిరంగంగా చెప్పిన మాటలు అంతా వినే ఉంటారని పేర్కొంటూ ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజిస్తోందనే విషయం స్పష్టం అయిందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. 
 
బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచార సభల్లో భాగంగా ఆదివారం రాజ్‌నాథ్ సింగ్ ఔరంగాబాద్, ససారాంలలో మాట్లాడారు. ప్రచారం చివరి రోజు ఆయన సుడిగాలి పర్యటనలు సాగాయి. ఓ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ విధంగా మాట్లాడటం తగునా? అని రక్షణ మంత్రి నిలదీశారు. హైదరాబాద్ జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని ఆయన ప్రస్తావించారు. 
 
కాంగ్రెస్ అంటే ముస్లింలు అట, ముస్లింలు అంటే కాంగ్రెస్ అట. ఈ ప్రకటన అర్థం ఏమిటనేది రేవంత్ చెపుతారా? అని ప్రశ్నించారు. ఈపాటికి దేశ ప్రజలకు అర్థం అయి ఉంటుందని పేర్కొంటూ బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ ఎప్పుడూ విభజన రేఖలతో న్రజలకు నష్టం కల్గించే రకం కాదని స్పష్టం చేశారు. అయితే మతం పేరిట దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాల చిచ్చు వైఖరి కాంగ్రెస్‌దే అనే విషయం రేవంత్ మాటలతో స్పష్టం అయిందని రాజ్‌నాథ్ విమర్శించారు. 
 
బీహార్‌లో కాంగ్రెస్ , ఆర్జేడీలు జట్టుకట్టాయి. ఓట్ల కోసం తమ రాజకీయ లబ్థికి అనేక విధాలుగా ఎన్‌డిఎను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఇక్కడ జంగిల్‌రాజ్‌ను సుదీర్ఘకాలం సాగించిన ఆర్జేడీ ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు అనేక మార్గాలు ఎంచుకొంటోందని ఆరోపించారు. 
 
మతాలు కులాలు వర్గాల పేరిట రాజకీయ లబ్ధికి పావులు కదుపుతున్న విషయాన్ని బీహారీలు గుర్తించాలని రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. మాజీ సిఎం విశ్రాంత లాలూ ప్రసాద్‌యాదవ్ ఇప్పటికీ త న అధికారం సాగేందుకు కలలు కంటున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఎద్దేవా చేశారు. పాపం ఆయన చెప్పే ఆ లూ లాలూ సమోసా రోజులు పొయ్యాయని స్పష్టం చేశారు. 
 
సమోసాలకు కేవలం ఆలూ ఒక్కటే సరిపోదు, సరైన బలవర్థకపు సరుకులతోనే అవసరం అని పేర్కొంటూ అయిన సమోసాలు ముందుకు వస్తాయని బీహార్‌కు లాలూ, సమోసాలకు లాలూ అనే మాట చెల్లనేరదని ఆర్జేడీ నేత గుర్తుంచుకుంటే మంచిదని రాజ్‌నాథ్ వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మలి తుది దశ పోలింగ్ మంగళవారం జరుగుతుంది. ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది.