ఒలింపిక్స్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు అనుమానమే

ఒలింపిక్స్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు అనుమానమే
128 ఏళ్ల తర్వాత 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించారు. 1900లో చివరిసారిగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో నిర్వహించారు. బ్రిటన్‌కు చెందిన సోమర్‌సెట్ వండరర్స్ క్లబ్, ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ రెండు రోజుల మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను జత చేయనున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇష్టపడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసిసి రూపొందించిన కొత్త రూల్స్‌తో భారత్-పాక్ మ్యాచ్ జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  తాజాగా దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఒలింపిక్స్‌లో క్రికెట్ గురించి ఐసిసి కొన్ని నిబంధనలు రూపొందించిందని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
 
ఆరు జట్ల చొప్పున పురుషులు, మహిళలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. టి-20 ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో టాప్‌లో ఉన్న జట్టును ఒలింపిక్స్‌కి నేరుగా పంపనున్నారు. 
 
ఐదో జట్టుగా ఆతిథ్య దేశానికి చోటు దక్కుతుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఐసిసి ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్‌కి ఆమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. 
 
దీంతో ఆ రెండు దేశాల్లో ఒక జట్టుకు ఐదో జట్టుగా చోటు దక్కనుంది. ఇక ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసిసి నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఐసిసి సమాలోచన చేస్తుంది. అందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్‌కు పంపించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్‌కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు.