ఆసియా కప్ ఛాంపియన్ భారత జట్టు మరో పొట్టి సిరీస్ పట్టేసింది. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టీ20 వర్షార్పణం కావడంతో 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. గబ్బాలో భారత ఇన్నింగ్స్ 4.5 ఓవర్ వద్ద అంతరాయం కలిగించిన వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు చివరకు ఆటను రద్దు చేశారు. దాంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు విజయాలు సాధించిన సూర్యకుమార్ యాదవ్ బృందం విజేతగా నిలిచింది.
పొట్టి క్రికెట్‌లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి చాటుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ (2-1) చేజారినా తమకు కొట్టినపిండి అయిన టీ20ల్లో కంగారూ టీమ్‌కు షాకిచ్చింది టీమిండియా. తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండో టీ20లో ఆతిథ్య జట్టు గెలిచి సిరీస్ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కాంబినేషన్‌లో మార్పులు చేసుకున్న టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో కంగారూలకు చెక్ పెట్టింది.
పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఓపెనర్ అభిషేక్ శర్మలు మెరవడంతో మూడో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గొప్పగా రాణించడంతో నాలుగో టీ20లో మార్ష్ సేనను మట్టికరిపించింది. నిర్ణయాత్మకమైన ఐదో మ్యాచ్ వర్షార్పణం కావడంతో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియాను విజేతగా ప్రకటించారు.
నాలుగో టీ20లో భారీ విజయంతో సిరీస్‌లో ముందంజ వేసిన భారత్ ఐదో మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(23 నాటౌట్), శుభ్‌మన్ గిల్(29 నాటౌట్)లు బౌండరీలతో విరుచుకుపడి శుభారంభమిచ్చారు. అయితే.. 4.5వ ఓవర్లో భారీగా ఉరుములు, మెరుపులు కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు అంపైర్లు. ఆ కాసేపటికే వర్షం పడడంతో పిచ్‌ను సిబ్బంది కవర్లతో కప్పేశారు.
కొద్ది సేపటికి తగ్గినట్టే తగ్గిన వాన మళ్లీ జోరందుకోవడంతో మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. సిరీస్ ఆసాంతం అద్భుతంగా ఆడిన అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు. గత మూడేళ్లలో ఆసీస్ సొంతగడ్డపై టీ20 సిరీస్ కోల్పోవడం ఇది నాలుగోసారి. మూడు పర్యాయాలు టీమిండియా చేతిలోనూ ఆ జట్టుకు పరాభవం ఎదురవ్వడం గమనార్హం.

More Stories
ఆసియా కప్ వివాదంపై ఐసిసి ప్రత్యేక కమిటీ
మధుమేహం, ఊబకాయం ఉంటె అమెరికా వీసా కష్టమే!
పాక్ అణుకేంద్రంపై దాడిని అడ్డుకున్న ఇందిరా గాంధీ!