రాబోయే కాలంలో అరుదైన ఖనిజ నిక్షేపాలపై పట్టు ఉన్న దేశాలదే రాజ్యం. తాజాగా ప్రపంచ దేశాలకు అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలను విధిస్తున్నట్లు ఈ ఏడాది అక్టోబరులో చైనా ప్రకటించింది. దీంతో షాక్‌కు గురైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అక్టోబరు నెల 30న దక్షిణ కొరియా వేదికగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ట్రంప్ విన్నపం అరుదైన ఖనిజాల ఎగుమతిపై ఆంక్షల అమలును ఏడాది పాటు ఆపుతున్నట్లు చైనా ప్రకటించింది.
ఇది అమెరికాకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒకవేళ శాశ్వత పరిష్కారం కావాలంటే అమెరికా, జపాన్‌లు తమ అరుదైన ఖనిజాల నెట్‌వర్క్‌లో భారత్‌ను 3వ మూల స్తంభంగా మార్చుకోవాలని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు సూచిస్తున్నారు. భారత్‌లోని బీచ్‌లలో ఉన్న ఇసుక నిక్షేపాల్లో మోనాజైట్, బాస్ట్‌నేసైట్, ఇతరత్రా అరుదైన ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే వాటిని ప్రాసెసింగ్ చేసే సాంకేతిక సామర్థ్యం ప్రస్తుతానికి భారత్‌కు లేదు.
పర్యావరణపరమైన నిబంధనలు సైతం అనుకూలంగా లేవు. ఈమేరకు విశ్లేషణతో అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకుడు జియాన్లీ యాంగ్ ‘ది డిప్లొమాట్’లో ఆసక్తికర కథనాన్ని రాశారు. ముడి అరుదైన ఖనిజాలను శుద్ధి చేసి, వాటిలోని వ్యర్థాలను తొలగించడం అనేది సంక్లిష్టమైన ప్రక్రియ. దీనిపై భారత్ ప్రయోగాలు చేస్తూ సాంకేతిక అంశాలన్నీ నేర్చుకోవాలంటే చాలా ఏళ్ల టైం పడుతుంది.
దీర్ఘకాలిక ప్రయోగ పరీక్షలు అనే అవరోధం వల్లే అమెరికా, ఆస్ట్రేలియాలు త్వరగా అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ టెక్నాలజీని పొందలేకపోయాయని జియాన్లీ యాంగ్ గుర్తుచేశారు. ‘క్వాడ్’ కూటమిలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఉన్నాయి. ఈ నాలుగు దేశాలు అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేస్తే, ప్రపంచ స్వరూపమే మారిపోతుందని జియాన్లీ యాంగ్ పేర్కొన్నారు.
క్వాడ్ కూటమిలోని దేశాలు ఉమ్మడి నౌకాదళ విన్యాసాలు చేస్తుంటాయి. ఇప్పటికే ఇవి సెమీకండక్టర్ల తయారీ విభాగంలోనూ కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారాన్ని అరుదైన ఖనిజాల నెట్‌వర్క్‌కూ విస్తరించాలని ఆయన సూచిస్తున్నారు. తద్వారా అరుదైన ఖనిజ నిక్షేపాల మార్కెట్‌పై చైనా పెత్తనానికి చెక్ పడుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అరుదైన ఖనిజాల కోసం ప్రపంచ దేశాలన్నీ చైనాపైనే ఆధారపడుతున్నాయి. అమెరికా, భారత్ కూడా ఈ జాబితాలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం జూన్‌లో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అరుదైన ఖనిజ నిక్షేపాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో, భారత్‌లోనే అరుదైన ఖనిజాల మ్యాగ్నెట్లను తయారు చేయగలిగే దేశీయ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని మోదీ సర్కారు వెల్లడించింది.
ఈ ప్రాజెక్టులో భాగమయ్యే భారతీయ కంపెనీల కోసం ఆర్థిక ప్రోత్సాహక పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. సోనా కామ్‌స్టార్ లాంటి భారతీయ కంపెనీలు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ, ఉత్పత్తి మార్గాలను సిద్ధం చేస్తున్నాయి. అరుదైన ఖనిజాలను శుద్ధి చేసే సామర్థ్యాన్ని పెంచుకోవాలనే టార్గెట్‌ను భారత ప్రభుత్వానికి చెందిన ‘ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్’ కంపెనీకి మోదీ సర్కారు నిర్దేశించింది.
ఈ క్రమంలో ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ కంపెనీకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారాన్ని అందించనుంది. శాటిలైట్ల విడి భాగాల కోసం రూపొందించిన ‘హై ప్యూరిటీ సెపరేషన్ టెక్నాలజీ’ని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్కు అందించే పనిలో ఇస్రో నిమగ్నమైందని తన వ్యాసంలో జియాన్లీ యాంగ్ వివరించారు. యాపిల్ ఐఫోన్ల అసెంబ్లింగ్ విభాగాల నుంచి వాటి చిప్‌ల డిజైనింగ్ కేంద్రాల దాకా అన్నింటిని ఏర్పాటు చేయడంలో భారత్ విజయవంతం అయిందని జియాన్లీ యాంగ్ గుర్తుచేశారు.
భారత్‌కు తగినన్ని ఆర్థిక ప్రోత్సాహకాలను అందించి, సరైన టెక్నాలజీని బదిలీ చేస్తే అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ విభాగంలోనూ దూసుకుపోగలదని స్పష్టం చేశారు. ఇందుకోసం అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలను, ఎగుమతి-దిగుమతి గ్యారంటీలను భారత్‌కు అందించాలని ఆయన సూచించారు. క్వాడ్ కూటమిలోని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు భారత్‌తో కలిసి అరుదైన ఖనిజ నిక్షేపాలను అన్వేషిస్తే మంచి ఫలితాలు వస్తాయని జియాన్లీ యాంగ్ పేర్కొన్నారు.
అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రారంభ దశ ప్రాసెసింగ్‌పై ఆస్ట్రేలియాకు పట్టు ఉంది. పశ్చిమ అర్ధగోళంలోని అరుదైన ఖనిజ నిక్షేపాలకు నెలవు బ్రెజిల్. రేర్ ఎర్త్ మినరల్స్‌తో ‘నియో డైమియం అండ్ ప్రసియో డైమియం’ (ఎన్‌డీపీఆర్) లోహం అమెరికాలోని కాలిఫోర్నియాలో తయారవుతోంది. ఆ దేశంలోని టెక్సాస్‌లో రేర్ ఎర్త్ మెటీరియల్ అయస్కాంతాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ దేశాలన్నీ ఒంటరిగా చైనాను ఢీకొట్టలేవని, భారత్‌తో కలిసి పనిచేస్తేనే వాటికి ప్రయోజనకరమైన ఫలితాలు వస్తాయని జియాన్లీ యాంగ్ అభిప్రాయపడ్డారు.

More Stories
బిహార్‌కు అవినీతి, తుపాకుల ప్రభుత్వం అక్కర్లేదు
సున్నితమైన సమాజం మాత్రమే ప్రతి మానవుడిని ఉద్ధరిస్తుంది
4 వందే భారత్ రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ