వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుండి 25 వరకు ‘వందేమాతరం@150’ పేరుతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద నిర్వహించిన “వందేమాతరం@150” ఉత్సవంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, ఎంపీ శ్రీమతి. డీకే అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
భారతమాత సంకెళ్లను తెంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ వందేమాతరం ఉత్సవాలను మనం ఏడాది పాటు ఘనంగా జరుపుకుందామని కిషన్ రెడ్డి పిలుపిచ్చారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరారు. బంకించంద్ర ఛటర్జీ మన దేశం సుసంపన్న దేశంగా, విశ్వగురువుగా ఉండేలా ఆశించారని చెప్పారు.
స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఎందరో మహానుభావులు ‘వందేమాతరం’ రణ నినాదంతో పోరాడారని, బానిస సంకెళ్లను తెంచడంలో ఈ గేయం స్వతంత్ర పోరాటంలో అద్భుతమైన స్ఫూర్తిని నింపిందని ఆయన తెలిపారు. అందుకే, నేటి యువతరం ఈ స్ఫూర్తిని భవితరానికి అందించాలని కోరారు. ఇది ఒక్క మతానికి సంబంధించిన నినాదం కాదని, ఇది అన్ని వర్గాలలో స్ఫూర్తిని నింపిందని చెబుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన నినాదం ఇదే అని కిషన్ రెడ్డి వివరించారు.
బ్రిటిషర్లపై పోరాటంలోనే కాదు, నిజాం, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కూడా వందేమాతరం నినాదం కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పోరాటంలో నారాయణరావు పవర్, వందేమాతరం రామచందర్, రామ్ నాథ్ తిర్ధ గారు కావచ్చు… ఎందరో మహానుభావులు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేశారని ఆయన కొనియాడారు. వారి త్యాగాల ఫలితంగానే ఈ గడ్డపై మూడు రంగుల జెండా ఎగిరేలా చేశామని తెలిపారు.
వందేమాతరమ్ అంటే భరతమాతకు వందనం అని చెబుతూ మన రాష్ట్ర యువత, విద్యార్థులు వందేమాతరం గీతం అసలైన మహత్తును అర్థం చేసుకోవాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు కోరారు. వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు అది భారతీయుల జీవన జ్యోతి అని చెప్పారు. మన దేశ స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన శక్తిగా వందేమాతరం గేయం నిలిచిందని, ఆ జ్వాల, ఆ ప్రేరణ మనలో ప్రతి రోజూ సజీవంగా ఉండాలని స్పష్టం చేశారు.
ప్రధాని నరంద్ర మోదీ పిలుపునిచ్చిన విధంగా స్వాతంత్ర్య పోరాటం జరిగిన రోజుల్లో ప్రజలు ఒకరినొకరు ఐక్యతను చాటిచెప్పేలా ‘వందేమాతరం’ అని అభివాదం చేసేవారని తెలిపారు. అదే ఉత్సాహం, ఆ భావం ప్రతి భారతీయుడిని, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలవాలని అభిలాషను వ్యక్తం చేశారు.

More Stories
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కొమ్ముకాస్తున్న అధికారులు
ఏదీ అసాధ్యం కాదనే ధైర్యం ఇస్తుంది వందేమాతరం
ఉగ్ర యత్నం భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు.. ముగ్గురు అరెస్ట్