బిహార్‌ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో పోలింగ్‌

బిహార్‌ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో పోలింగ్‌
బిహార్‌ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో పోలింగ్‌బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్‌ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ చూడని స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో గురువారం తొలి దఫా ఎన్నికలు జరగ్గా ఏకంగా 64.66 శాతం పోలింగ్‌ నమోదైంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దఫాలో 56.2 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పుడు దానితో పోలిస్తే ఏకంగా 8.46 శాతం అధిక పోలింగ్‌ రికార్డుకావడం గమనార్హం.
 
బిహార్‌లో తొలి దఫా పోలింగ్‌ జరిగిన 121 నియోజకవర్గాల్లో 59 సీట్లు ఎన్డీయే కూటమికి చెందినవే. మిగతా స్థానాలు ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్రుల ఖాతాలో ఉన్నాయి. తొలి దశ బరిలో ఆర్‌జేడీకి చెందిన తేజస్వీ యాదవ్‌, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్‌ చౌదరి ఉన్నారు. పోలింగ్ భారీగా ఉండడంతో అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి ఎవ్వరికీ వారు తమకోసమే ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెబుతున్నారు.
 
“బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశ ఈరోజు పండుగ వాతావరణంలో ప్రశాంతంగా ముగిసింది, బీహార్ చరిత్రలోనే అత్యధికంగా 64.66% పోలింగ్ నమోదైంది” అని అత్యున్నత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. రెండవ దశ పోలింగ్ నవంబర్ 11, మంగళవారం జరుగుతుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది. 
 
భారీ సంఖ్యలో ఓటు వేసినందుకు బీహార్ ప్రజలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అభినందించారు. భారత ఎన్నికల కమిషన్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసినందుకు, ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి వచ్చినందుకు ఓటర్లకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి పారదర్శకత, అంకితభావంతో పనిచేసినందుకు మొత్తం ఎన్నికల యంత్రాంగానికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
 
ఎన్నికల కమిషన్ అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమం కింద దశ 1 పోలింగ్ లో దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, బెల్జియం, కొలంబియా అనే 6 దేశాల నుండి 16 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పోలింగ్ ప్రక్రియలను వీక్షించారు. బీహార్ ఎన్నికలు అంతర్జాతీయంగా జరిగాయని ప్రతినిధులు ప్రశంసించారు.

వివిధ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులు తమ తమ ప్రాంతాల్లో ఆరంభంలోనే ఓటుహక్కు వినియోగించుకున్నారు. బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్ భక్తియార్‌పుర్‌లో ఓటువేశారు. మరోసారి ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్, బిజెపి ఎంపీ రవిశంకర్ ప్రసాద్, ఆయన సతీమణి మాయాశంక పాట్నాలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్‌లో ఓటు వేశారు. 

కేంద్రమంత్రి, ఎల్జేపీ-రామ్‌ విలాస్ పార్టీ చీఫ్ చిరాగ్ పాశవన్ ఖగారియాలో ఓటు వేశారు. మాజీ సీఎం, ఆర్జేడీఅధినేత లాలూప్రసాద్, ఆయన సతీమణి రబ్రీదేవి, కుమారుడు, మాజీ మంత్రి తేజస్వీ యాదవ్ పాట్నాలో ఓటువేశారు. బిహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు లాలూ తెలిపారు. జన్‌శక్తి జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు, లాలూ పెద్దకుమారుడు తేజ్‌ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటువేశారు.