నేపాల్ లో 10 వామపక్ష పార్టీల విలీనం

నేపాల్ లో 10 వామపక్ష పార్టీల విలీనం
నేపాల్‌లో తొమ్మిది10 వామపక్ష పార్టీలు విలీనమై కొత పార్టీని ప్రకటించాయి. సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌), సిపిఎన్‌ (యునిఫైడ్‌ సోషలిస్ట్‌) సహా మరో ఎనిమిది  పార్టీలు నేపాల్‌ రాజధాని ఖాట్మాండులో బుధవారం జరిగిన భారీ బహిరంగ సభలో ఈ విలీన ప్రకటన చేశాయి. నేపాలి కమ్యూనిస్టు పార్టీగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. మార్చి ఐదవ తేదిన సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం వెలువడటం గమనార్హం. 
 
విలీన ప్రకటనకు ముందు తొమ్మిది వామపక్ష పార్టీల ఆధ్వర్వంంలో భారీ ప్రదర్శన జరిగింది. ఐదు కోణాల నక్షత్రాన్ని ఎన్నికల గుర్తుగా స్వీకరిస్తున్నట్లు నూతనంగా ఏర్పాటైన నేపాలి కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. సిపిఎన్‌ (మావోయిస్టు సెంటర్‌) అధ్యక్షుడు, మాజీ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహాల్‌ ‘ప్రచండ కొత్త పార్టీకి సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. సిపిఎన్‌ (యునిఫైడ్‌ సోషలిస్ట్‌) అధినేత మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ సహసమన్వయకర్తగా ఉంటారు.
 
“నేపాలీ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రలో ఈ రోజు చారిత్రాత్మకమైనదిగా మారింది.  ఎందుకంటే పది కమ్యూనిస్ట్ పార్టీలు ఒకటిగా విలీనం కావడం బహుశా నేపాల్‌లో ఇదే మొదటి సారి కావచ్చు. గతంలో రెండు లేదా మూడు పార్టీలు విలీనం అయి ఉండవచ్చు. కానీ వేర్వేరు నాయకుల నేతృత్వంలో చాలా కాలంగా తమ సొంత స్థానంలో ఉనికిలో ఉన్న పది పార్టీలు, ఇప్పుడు ప్రతిబింబిస్తున్న ఐక్యత అపూర్వమైనది, చారిత్రాత్మకమైనది , అసాధారణమైనది” అని నేపాలీ మాజీ ప్రధాన మంత్రి, కొత్తగా ఏర్పడిన నేపాలీ కమ్యూనిస్టు పార్టీ సమన్వయకర్త తెలిపారు.
 
“దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించి జాతీయ ఏకాభిప్రాయాన్ని ఏర్పరచడానికి రాజకీయ పార్టీలపై చేస్తున్న ఆరోపణలను, ఈ రోజు కొత్త స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రారంభించడానికి, కొత్త తీర్మానాన్ని రూపొందించడానికి ఒక రోజు” అని దహల్ పేర్కొన్నారు.  గత బలహీనతలను సరిదిద్దడం ద్వారా, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం ద్వారా పార్టీ బలమైన శక్తిగా ముందుకు సాగుతుందని మాధవ్ కుమార్ నేపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
నేపాల్ రాజ్యాంగం, గణతంత్రాన్ని రక్షించడానికి ఇతర ప్రగతిశీల శక్తులతో సహకారం, పొత్తులకు పిలుపిచ్చారు. అదే సమయంలో జాతి వ్యతిరేక లేదా రాజ్యాంగ వ్యతిరేక అంశాలతో ఎటువంటి రాజీలు ఉండవని స్పష్టం చేశారు.  మార్క్సిజం, లెనినిజంను సైద్ధాంతిక మార్గదర్శకంగా తీసుకుంటున్నట్లు బహిరంగ సభలో నేతలు తెలిపారు. 
 
రానున్న ఆరు నెలల కాలంలో జాతీయ మహాసభ నిర్వహించి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని ప్రకటించారు. మావోయిస్టు సెంటర్‌, యునిఫైడ్‌ సోషలిస్ట్‌ పార్టీలతో పాటు నేపాల్‌ సమాజవాది, సిసిఎన్‌ (సోషలిస్ట్‌), జనసమాజవాది పార్టీ నేపాల్‌, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎన్‌ (మావోయిస్టు సోషలిస్ట్‌) సిపిఎన్‌ సమబాది, దేశభక్త సమాజవాది మోర్చా పార్టీలు ఈ విలీన ప్రకటన చేశాయి.
 
అయితే, మావోయిస్టు కేంద్రానికి చెందిన జనార్దన్ శర్మ, రామ్ కర్కి, యూనిఫైడ్ సోషలిస్ట్‌కు చెందిన ఘనశ్యామ్ భూషల్, రామ్ కుమారి ఝాక్రి వంటి కొన్ని వర్గాలు విలీనం ప్రక్రియ నుండి వైదొలిగాయి. కొత్త పార్టీ హిమాలయ దేశానికి శక్తి కేంద్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, విలీన సమూహాలలో అనేకం గణనీయమైన అట్టడుగు మద్దతును కలిగివి లేవని విమర్శకులు భావిస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన పార్టీ తక్షణ ప్రభావం గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.