ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే తిరుమలలో దర్శనం

ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే తిరుమలలో దర్శనం

మొదటి సమావేశంలోనే అన్యమతస్తులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లోనే సాధారణ భక్తులకు దర్శనం చేయిస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. లడ్డూ, అన్నప్రసాదంలో నాణ్యత పెంచినట్లు స్పష్టం చేశారు. టీటీడీ పాలకమండలి బాధ్యతలు చేపట్టి బుధవారంతో సంవత్సరం పూర్తయిన సందర్భంగా బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి, మహేందర్‌రెడ్డి, అనుగోలు రంగశ్రీతో కలిసి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. 

శ్రీవారి భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తుందని పేర్కొంటూ శ్రీవారి సమయ నిర్దేశిత దర్శన టోకెన్లు (ఎస్‌ఎస్‌డీ) కలిగిన భక్తులు తిరుమలలో పడుతున్న ఇక్కట్లను తొలగించేలా టీటీడీ ధర్మకర్తల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. తిరుపతిలో ప్రతిరోజూ దాదాపు 12 వేల నుంచి 16 వేల వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తారు. 

వీటిని పొందిన భక్తులు తిరుమలకు వచ్చాక స్థానిక ఎంబీసీ ప్రాంతంలోని ఏటీజీహెచ్‌ అతిథి గృహం సమీపంలోని ప్రవేశమార్గం నుంచి క్యూలైన్‌లోకి వెళ్లాలి. ఈ ప్రాంతం ఇరుగ్గా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని విస్తరించాలని బోర్డు నిర్ణయించింది. ఇక్కడ నూతనంగా నాలుగు వేల మంది భక్తులు కూర్చునేలా నూతన షెడ్, క్యూలైన్ల ప్రవేశమార్గాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.

వసతి కోసం అదనంగా భవనాలను కట్టడం కుదరదని ఛైర్మన్​ స్పష్టం చేశారు.  అందుకే కింద (తిరుపతిలో)50 ఎకరాల భూమి చూసినట్లు ఆయన వెల్లడించారు. 25 వేల మంది వసతికి సరిపడా అన్ని సదుపాయాలతో పెద్ద కాంప్లెక్స్‌లను కట్టే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. అక్కడి నుంచే భక్తులను బస్సుల్లో తిరుమలకు తీసుకెళ్లి దర్శనం చేయించి తిరిగి కిందికి తీసుకువచ్చే ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఛైర్మన్‌ వివరించారు.

వైఎస్సార్సీపీ హయాంలో తిరుమలలో అక్రమంగా 1,500 వాణిజ్య దుకాణాల్ని కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల పవిత్రతపై ప్రభావం పడుతుండటంతో వాటిని తొలగించాలని రెవెన్యూశాఖకు చెప్పినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో ముంతాజ్‌ హోటల్‌కు కేటాయించిన 20 ఎకరాల భూముల లీజును రద్దుచేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని చెప్పారు.

తిరుమల కాంక్రీట్‌ జంగిల్‌లా మారకుండా చూడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న 68 శాతం పచ్చదనాన్ని 80 శాతానికి పెంచుతామని ఆయన పేర్కొన్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్టు పేరును శ్రీ వేంకటేశ్వర ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా మార్చే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని బీఆర్‌ నాయుడు వివరించారు. 

 
బోర్డు సభ్యుల దర్శన కోటాను గణనీయంగా తగ్గించుకుని, సామాన్యులకు పెద్దపీట వేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఏ బోర్డూ చేయనన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు పనబాక లక్ష్మి, నర్సిరెడ్డి, మహేందర్‌రెడ్డి తెలిపారు.