జమ్మూ–కశ్మీర్ ప్రాంతంలో మళ్లీ ఉగ్రవాద చర్యలు జరపాలనే ఉద్దేశ్యంతో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలు చురుకుగా కదులుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ సైన్యంలోని ఎస్ ఎస్ జి కమాండోలు, ఐఎస్ఐ మద్దతుతో ఈ సంస్థలు భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులను చొరబెడుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఉగ్రవాది షంషేర్ నేతృత్వంలోని గ్రూప్ డ్రోన్లను ఉపయోగించి ఎల్ఓసి వద్ద గ్యాప్‌లు ఎక్కడున్నాయో ఖచ్చితంగా గుర్తించిందని సమాచారం. ఈ చర్యలు దేశంలో పెద్ద స్థాయి ఉగ్ర దాడులకు సంకేతాలుగా భావిస్తున్నట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. భారత నిఘా సంస్థల నివేదికల ప్రకారం, పాక్ బార్డర్ యాక్షన్ టీమ్స్ (బాట్) ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో సీమాంతర దాడులకు సిద్ధమయ్యాయి.
లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు ఆర్థిక సాయం, ఆయుధ సరఫరా, శిక్షణాలను ఐఎస్ఐ సమకూరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత సైన్యం, సిఆర్పిఎఫ్, స్థానిక పోలీస్ దళాలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దు ప్రాంతాల్లో రాత్రిపూట డ్రోన్ గమనికలు, సర్వైలెన్స్ పటిష్టం, పేట్రోలింగ్ పెంపు వంటి చర్యలు చేపట్టారు.
భారత భద్రతా సంస్థలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఇటీవల ఎల్ఓసి సమీప ప్రాంతాల్లో పాక్ నుండి వచ్చిన డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపే ప్రయత్నాలు పలు సార్లు అడ్డుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో భారత భద్రతా వ్యవస్థ మరింత దృఢంగా కట్టుదిట్టం అవుతోంది. సైనికులు, నిఘా సంస్థలు సమన్వయంతో ఈ కుట్రలను ముందుగానే అడ్డుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా, కిష్త్వార్ జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కిష్త్వార్లోని ఛత్రు అనే మారుమూల ప్రాంతంలో ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్‌ను ప్రారంభించిన భారత సైన్యం అక్కడ నక్కి ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టడంతో ఈ ఎదురుకాల్పులు మొదలయ్యాయి. దీనిపై వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ లో ఓ ప్రకటన చేసింది.
నిఘావర్గాలు అందించిన పక్క సమాచారంతో రంగంలోకి దిగిన నైట్ కార్ప్స్ బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో ఓ భారీ ఆపరేషన్‌ను చేపట్టాయి. వైట్ నైట్ కార్ప్స్ బలగాలు తెల్లవారుజామున ఛత్రు ప్రాంతంలో ఈ ఆపరేషన్ ఛత్రు చేపట్టినట్లు ప్రకటించారు. ఇక ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది.
విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ బృందం గత కొన్ని నెలలుగా ఆ ప్రాంతంలో చురుకుగా ఉందని, అందుకే భద్రతా బలగాలు వారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాయని తెలుస్తోంది. కిష్త్వార్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న ఛత్రు ప్రాంతంలో గత ఏడాది కాలంగా అడపాదడపా మిలిటెంట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. కిష్త్వార్ కొండలలో గత ఏడు నెలల్లో ఆరు ఎన్కౌంటర్లు జరిగాయి.
మరోవైపు మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు జమ్మూ, కిష్త్వార్ జిల్లాల్లో ఇద్దరు నిందితులను పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నారు. ఇందులో జమ్మూ నివాసి అయిన తజిందర్ సింగ్ అలియాస్ హ్యాపీని పూంచ్ జిల్లా జైల్లో.. కిష్త్వార్కు చెందిన సలీమ్ జావేద్‌ను డ్రగ్స్ పెడ్లింగ్‌కు సంబంధించి కోట్ భల్వాల్ జైల్లో ఉంచారు. కిష్త్వార్‌లో ఆపరేషన్ ఛత్రు ఇంకా కొనసాగుతున్నందున ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారా మట్టుబెట్టారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
More Stories
అమెరికాలో ఇన్స్టాగ్రామ్ రాజకీయవేత్త జోహ్రాన్ మమ్దానీ
భారత సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగొద్దు
7వ తేదీ నుంచి ఆపరేషన్లోకి నిసార్ ఉపగ్రహం