మద్యం కేసులోనూ జగన్ ముద్దాయి కాబోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి బలం క్రమంగా పెరుగుతోందని, జగన్ మోహన్ రెడ్డి బలం తగ్గుతోందని తెలిపారు. సూపర్ సిక్స్‌తో సూపర్ హిట్ కొట్టిన కూటమి ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సూపర్ చెక్ పెట్టబోతోందని స్పష్టం చేశారు. మద్యం కేసుల్లో అనేక మంది వైఎస్సార్సీపీ నేతలు ఇరుక్కున్నారన్నారని గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలం బాగా తగ్గిపోయిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. “ఇటీవల వాళ్ల నాయకులు ఎందరో జైలుకు వెళ్లారు. జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు చేశారు.ఎంతో దోచుకున్నారు. జగన్, భారతీరెడ్డి ఏ దారుణమైనా చేస్తారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది వాళ్లే. ఆ కేసును సీబీఐ మళ్లీ విచారణ జరపాలి” అని డిమాండ్ చేశారు.
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు తరిమికొట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తోందని ఆయన తెలిపారు. “జగన్ ధన దాహానికి అడ్డూ అదుపు లేదు. మహా తల్లి భారతి 400 కిలోల బంగారం కొనుగోలు చేశారు. సారాయి అమ్మి, ఇసుక దోచి, మైనింగ్ తవ్వి నేలమాళిగల్లో దాచాడు. రాష్ట్రం సర్వ నాశనం అవ్వాలన్నదే ఆయన ఆలోచన. అధికారంలో ఉన్నప్పుడు ఏది అనుకుంటే అది చేశాడు” అంటూ విమర్శించారు.
“చంద్రబాబు అరెస్టు నుంచి ఎన్నెన్నో తప్పులు చేసి, చివరికి చెల్లెళ్ల దగ్గర కూడా చెల్లకుండా పోయాడు. ధర్మ సంస్కృతిని వదిలేసి విష సంస్కృతికి అలవాటు పడ్డాడు. కనకం, రాజరికం తప్ప రాష్ట్రం ఏమై పోయినా జగన్‌కు పట్టదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పునర్విచారణ జరగాల్సిందే. వాళ్లే చంపి మాపై అన్యాయంగా నింద వేశారు. వైఎస్ జగన్, భారతి ఇందులో ముద్దాయిలు. లిక్కర్ కేసులోనూ జగన్ తప్పించుకోలేరు’’ అని తెలిపారు.
పూర్వోదయ పథకం కింద కేంద్రం ఎంపిక చేసిన ఆరు రాష్ట్రాలలో ఏపీ కూడా ఉందని చెబుతూ మన రాష్ట్ర ప్రాజెక్టులకు రూ.65 వేల కోట్లు కేటాయించనున్నట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి 4 విమానాశ్రయాలు, సాగరమాల కింద 4 పోర్టులు వస్తున్నాయని, మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ టిడ్కో ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఎమ్మల్యే వివరించారు. సూపర్ సిక్స్, సూపర్ హిట్ అయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. జీఎస్టీ-2 ద్వారా ప్రజలకు అనేక లాభాలు కలుగుతున్నాయ అని ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

More Stories
మొంథా తుఫాన్ బాధిత రైతులకు పంటల భీమా ప్రశ్నార్ధకం!
ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి సారించాలి