భారత మహిళా క్రికెటర్లను అభినందించిన ప్రధాని మోదీ

భారత మహిళా క్రికెటర్లను అభినందించిన ప్రధాని మోదీ
చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత భారత మహిళల క్రికెట్‌ జట్లు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఆదివారం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. 52 సంవత్సరాల మహిళా క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్నందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టును ప్రధాని మోదీ అభినందించారు.
 
వరుసగా మూడు పరాజయాలు, సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న తర్వాత టోర్నీలో అద్భుతమైన పునరాగమనం చేసి టైటిల్‌ను సాధించడంపై ప్రధాని ప్రశంసించారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత మహిళా జట్టుకు హోటల్‌లో డ్రమ్స్, పూలతో ఘన స్వాగతం లభించింది. ప్లేయర్లు, కోచ్ అమోల్ మజుందార్ కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ప్రధానమంత్రి మోదీ జట్టును అభినందించారు. 
 
భారత క్రికెట్ ఈ చారిత్రాత్మక క్షణం కలల విజయంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ప్రధానికి ‘నమో’ అని ఉన్న జెర్సీని అందజేశారు.  ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ వర్తమానంలో ఎప్పుడూ ఎలా ఉండగలుగుతున్నారు? అంటూ ప్రధానమంత్రిని ప్రశ్నించారు. అలా ఉండటం తన జీవితంలో ఒక భాగమైందని, అది తనకు అలవాటుగా మారిందని ప్రధానమంత్రి తెలిపారు. 
 
2021లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్లీన్ క్యాచ్‌ను కూడా ప్రధాని గుర్తు చేశారు. ఆ సమయంలో ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫైనల్ మ్యాచ్ తర్వాత హర్మన్‌ప్రీత్ బంతిని ఎలా జేబులో వేసుకుందో ప్రధాని చర్చించారు. బంతి తన వద్దకు రావడం తన అదృష్టమని, దాన్ని తాను కాపాడుకున్నానని చెప్పింది. అమంజోత్ కౌర్ క్యాచ్‌పై ప్రధాని చర్చించారు.

ఇది తాను చూడటానికి ఇష్టపడే ఒక తడబాటని చెప్పింది. క్యాచ్ పట్టుకుంటూ మీరు బంతిని చూస్తుండాలి కానీ క్యాచ్ తర్వాత మీరు ట్రోఫీని చూస్తుండాలని ప్రధాని పేర్కొన్నారు. తన సోదరుడు ప్రధానమంత్రికి ఎంత పెద్ద అభిమాని అని క్రాంతి గౌడ్ చెప్పగా దానికి వెంటనే కలవమని చెప్పారు. ఫిట్ ఇండియా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని క్రికెటర్లను ప్రధాని కోరారు. 
 
పెరుగుతున్న ఊబకాయం సమస్య గురించి ఆయన చర్చించారు. పాఠశాలలకు వెళ్లి అక్కడి యువతను ప్రోత్సహించాలని కోరారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ ప్రధానమంత్రి తమను ప్రేరేపించారని, తమకు ప్రేరణగా నిలిచారని తెలిపింది. నేడు అమ్మాయిలు అన్ని రంగాల్లో ఎలా బాగా రాణిస్తున్నారని, దీనికి ప్రధానమంత్రి కారణమని, ప్రధానిని కలవడానికి తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని దీప్తిశర్మ చెప్పుకొచ్చింది.