పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ శకం ముగిసినట్లేనా!

పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ శకం ముగిసినట్లేనా!
దేశంలో మావోయిస్టుల లొంగుబాటుల పరంపర కొనసాగుతోంది. కీలక నేతలు అడవులు విడిచి జనం బాట పడుతున్నారు. సిద్దాంతపరమైన విభేదాలతో  సాయుధ పోరాట పంథాను విమర్శిస్తున్నవారు లొంగుబాటు పంథాను ఎంచుకుంటే. సాయుధ పోరాటామే మావోయిస్టు పార్టీ ఏకైక మార్గమని విశ్వసించే వారు కూడా వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలతో పాటు దట్టమైన అడవిలో చురుగ్గా కదులుతూ భారత సైన్యంతో పోటీపడి యుద్దం చేసేందుకు శరీరం సహకరించలేక లొంగిపోతున్నారు. 
 
మరికొందరు అజ్ఞాత పోరాటాలకు కాలం చెందిందని మైదానంలో ప్రజలను చైన్యతం చేసే ఉద్దేశ్యంతో కీకారణ్యం నుంచి “జనారణ్యం”లోకి వస్తున్నారు. భారత ప్రభుత్వం మొదలు పెట్టిన అంతిమ యుద్దం కగార్‌ తో మావోయిస్ట్‌ పార్టీ చెల్లచెదురైంది. 1990 తర్వాత కేంద్రం చెపట్టిన మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్లు కగార్‌తో తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో దండకారణ్యం రక్తమోడుతోంది. తుటాలు చిందించే రక్తంతో అడివి ఎరుపెక్కుతుంది. గోదావరి, ఇంద్రావతి నదుల్లో నీటితో పాటు విప్లవకారుల రక్తాన్ని పారిస్తున్నారు.
 
మరోవంక, ఆధునిక యువత అడవుల బాట పట్టి తుపాకులతో అమాయక ప్రజలపై యుద్ధం చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దానితో పాతతరం వారు ఒకరొక్కరు నిష్క్రమిస్తుండగా కొత్తగా ఆయా ఖాళీలను భర్తీ చేయడం దాదాపు దుర్లభం అవుతుంది. భారత్ ప్రపంచంలోని ఆర్ధికంగా, సైనికంగా, అభివృద్ధి పధంలో అగ్రగామి దేశంగా ఎదుగుతున్న సమయంలో మావోయిజం, కమ్యూనిజం వంటి సైద్దాంతింక చర్చలు కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి. 
 
ఎందుకంటె ఈ సిద్ధాంతాలకు కేంద్రబిందువుగా ఉంటూ భారత దేశంలోని వివిధ రకాల వామపక్ష మేధావులకు స్ఫూర్తి కేంద్రాలుగా ఉంటూ వస్తున్న రష్యా, చైనా దేశాలే నేడు అభివృద్ధి కోసం తమ సైద్ధాంతిక మూలలను తిలోదకాలు ఇచ్చుకోక తప్పడం లేదు. అక్కడక్కడా అమెరికా, ఐరోపా వంటి దేశాలలో వామపక్ష భావజాలం కనిపిస్తున్నా వారెవ్వరూ మావోయిస్టుల మాదిరిగా అడవులబాట పట్టి రక్తపాతమే సిద్దాంతంగా కొనసాగుతున్న వారు కాదు.
కొంత కాలంగా మావోయిస్టుల లొంగుబాటులను గమనిస్తే రెండు రకాల లొంగుబాటులు కనిపిస్తాయి. ఒకటి వయస్సు పెరగడం, ఆనారోగ్య సమస్యలతో లొంగుబాటు అయితే, ఇంకోటి దశాబ్దాలుగా తాము అనుసరిస్తున్న తుపాకీ రాజ్యం విధానాలు కాలం చెల్లాయని గ్రహించడం. తమ ప్రాబల్యం గల అటవీ ప్రాంతాలలో తమ కారణంగా ఆదివాసీయుల బతుకులు అభివృద్ధికి దూరంగా, విద్య, వైద్య సదుపాయాలకు సహితం నోచుకోక అచేతనంగా ఉండాల్సి  వస్తుందని గ్రహించడం.
 
తమ ప్రాబల్యం కలిగిన అటవీ ప్రాంతాలలో పాఠశాలలు, వైద్యశాలలు, కనీసం రహదారులు కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వాలను అడ్డుకోవడం; కాంట్రాక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకులను తుపాకులతో బెదిరించి భారీ మొత్తాలలో వసూలు చేసిన నిధులు అన్యాక్రాంతం కావడం ఇప్పుడు సైద్ధాంతిక ఆకర్షణలతో మావోయిస్టుల బాటపట్టిన వారిలో పునరాలోచన కనిపిస్తున్నది.
 
ఉమ్మడి తూర్పుగోదావరి గుడిమల్కాపూర్ అనే దట్టమైన అటవీప్రాంతంలోని గ్రామంలో  ఇద్దరు మహిళలు చైతన్యంతో మగవారెవ్వరు మద్యం సేవింపరాదని కట్టడి చేస్తూ, గ్రామంలోకి మద్యాన్ని రాకుండా అడ్డుకుంటే, ఆ మహిళలను 26 ఏళ్ళ క్రితం మావోయిస్టులు కర్కశంగా హత్య కావించారు. గిరిజనులను చైతన్యపరిచి భూమి, ఇతర హక్కులకోసం పోరాటాలు జరిపిస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలను అడవులలో పనిచేయకుండా భయపెట్టి గెంటేశారు.
 
గిరిజన ప్రజలు చైతన్యవంతులైతే తమకు నూకలు చెలిపోతాయనే భయమే అందుకు కారణం. కేవలం వారిని బానిసలుగా చేసుకొని, వారి తలపై తుపాకీ పెట్టి తమ రాజకీయాలు సాగిస్తూ వస్తున్న వారికి ఇప్పుడు గిరిజనుల మద్దతు సహితం దూరమవుతుంది. మావోయిస్టు పార్టీ అనుసరిస్తున్న మతిలేని విధానాలను ప్రశ్నించిన పలువురు అగ్రనాయకులు పోలీసులతో చేతులు కలిపి, ఎన్కౌంటర్ లలో చనిపోయే విధంగా చేస్తూ వచ్చారు.
 
మావోయిస్టు విధానాలలో సంస్కరణలకు పట్టుబట్టిన మల్లొజుల వేణుగోపాల్‌ రావు, తక్కళ్లపల్లి వాసుదేవ రావు వంటి వారిని నేడు విప్లవ ప్రతి ఘాతుకమని, పాలకులతో చేతులు కలిపారంటూ `అర్బన్ నక్సలైట్లు’ అక్కసు వెళ్లబుచ్చుకుంటున్నారు. మావోయిస్టులు దారితప్పు తున్నారని పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ ను ఏర్పాటు చేసిన కొండపల్లి సీతారామయ్య 1980వ దశకం ప్రారంభంలోనే గ్రహించారు. అందుకనే ఆయన జైలు నుండి తప్పించుకు వచ్చి, `పొరపాట్లు’ చేసిన వారిపై విచారణ జరిపించి, కొన్ని చర్యలు తీసుకున్నారు. వారి హోదాలను తగ్గించారు.
 
ఆ విధంగా `పొరపాట్లు’ చేసారని పేర్కొంటూ హోదాలు తగ్గించిన వారిలో గణపతి ప్రభృతులు ఉన్నారు. వారంతా వినయంగా కొండపల్లి ఆజ్ఞలు పాటిస్తున్నట్లు ఉంటూ, లోపాయికారిగా ఆయనకు వ్యతిరేకంగా సమీకరణాలు జరిపి, ఆయనకే అందులో స్థానం లేకుండా చేశారు. ఆ సందర్భంలో ఉద్యమంలో ఎనిమిది తప్పులకు పాల్పడుతున్నారని అంటూ కొండపల్లి ఎనిమిది పుస్తకాలు వ్రాసారు.
 
వాటిల్లో బెదిరించి డబ్బు వసూలు చేయడం, ఆశ్రయం ఇచ్చిన ఇళ్లల్లో మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, పోలీస్ ఇన్ఫార్మర్ల పేర్లతో గిరిజనులు, పేదలను చంపడం వంటి ఘటనలను సవివరంగా చర్చించారు. ఆ పుస్తకాలు బైటకు వస్తే తమ అకృత్యాలు అన్ని బైటపడతాయనే భయంతో 40 ఏళ్లయినా ఇప్పటి వరకు వాటిని ప్రచురించకుండా అడ్డుకుంటూ వచ్చారు. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రతా దళాలను మోహరించి ఏరివేయడం ఒక వంతయితే, మరొక వంక ఈ ఎనిమిది తప్పులే మావోయిస్టులను బందిపోటు దొంగలుగా, దళారులుగా మార్చివేసి, ప్రజలకు దూరం చేశాయని గుర్తించలేకపోతున్నారు. అంతర్గత వైరుధ్యాల కారణంగానే, సైద్ధాంతికంగా అనుసరిస్తున్న దివాలాకోరు విధానాల ఫలితంగా నేడు మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని గుర్తించాలి.
అందుకనే పీపుల్స్ వార్ గ్రూప్ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చింది. బెంగాల్ నుంచి జగిత్యాల వరకు, జగిత్యాల నుంచి జంగిల్ మహాల్ వరకు సాగిన జైత్రయాత్ర ఇప్పుడు తిరోగమంతో తెలంగాణలో ముగింపు పలుకుతుంది. దండకారణ్యం, రెడ్‌ కారిడార్‌  నుంచి పీపుల్స్ వార్ గ్రూప్ రిట్రీట్‌ అవుతున్నట్లు అర్థం అవుతుంది.
2004లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్,  మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా  కలిసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)గా ఏర్పడ్డాయి. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ తెలుగు రాష్ట్రాల్లో బలంగా ఉంటే, దండకారణ్యంలో ముఖ్యంగా బీహార్‌ జార్ఖండ్ సహా ఆదివాసులు ఉండే ప్రాంతాల్లో ఎంసిసి బలంగా ఉంది. అయితే, క్రమంగా మొత్తం నాయకత్వం పీపుల్స్ వార్ చేతుల్లోకి వెళ్ళింది.
 
మైదానప్రాంతం, ఉన్నత చదువులు చదువుకున్న వారు పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో ఉండటంతో మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు నాయకత్వం వహించారు.ఇ ప్పటికి వహిస్తున్నారు కూడా. తెలుగు రాష్ట్రాల్లో అణిచివేతతో విప్లవోద్యమం దండకారణ్యానికి విస్తరించిందనడంలో కొంతవాస్తవం ఉన్నా, అంతకుముందే అక్కడ రకరకాల విప్లవ గ్రూప్‌లు పని చేస్తున్నాయి. తెలుగు వారు వెళ్లడంతో పోరాటం కాస్తా మరింత బలంగా ఎదిగింది.
ముఖ్యంగా జన జీవన స్రవంతిలో కలుస్తున్న మెజార్టీ నేతలు పాత పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌కు చెందిన వారే కావడం ఆలోచించాల్సిన విషయం.  తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు, పూర్వాశ్రమంలో మైదాన ప్రాంతంలో పని చేసిన వారు, అన్నింటికీమించి పీపుల్స్ వార్ గ్రూప్ నేతలే లొంగుబాటు బాట పట్టడం కనిపిస్తుంది.
మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మరో ప్రధాన వైరుధ్యం కనిపిస్తుంది. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ నుంచి నాయకులుగా ఎదిగినవారు. అందులోనూ జగిత్యాల పోరాటాలను నడిపిన వారి నుంచే వరుస లొంగుబాటులు కనిపిస్తున్నాయి. దేశంలో సాయుధ పోరాటం విఫలమైందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ తిరుగుబాటు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న ప్రచారాన్ని  పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌లో ఎదిగిన కొందరు నాయకులు ప్రకటిస్తున్నారు. 
 
దారితప్పుతున్నారని నాలుగు దశాబ్దాల క్రితమే కొండపల్లి సీతారామయ్య గుర్తించిన నాయకులు ఆ తర్వాతి రోజులలో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, తమను ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ వచ్చిన నేతలనే కాకుండా గిరిజనులను, సామాజిక సేవకులను సహితం హతం చేస్తూ వచ్చిన వారే ఈ ఉద్యమాన్ని సమాధి చేస్తున్నారా? 
ఏదేమైనా మావోయిస్ట్‌ పార్టీలో పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ శకం ముగిసిన అధ్యయమే. మైదానం నుంచి అరణ్యం వెళ్లిన వారు మళ్లీ సాయుధ పోరాటాన్ని వదిలేసి మైదానం చేరుతున్నారు. నాలుగున్నర దశాబ్దాల పిడబ్ల్యూజీ  పోరాటం ఇక చరిత్ర పుటల్లోనే కనిపిస్తుంది.