మణిపూర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

మణిపూర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
భద్రతాబలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో యునైటెడ్‌ కుకీ నేషనల్‌ ఆర్మీ (యుకెఎన్ఏ) కి చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మణిపూర్‌లోని ఖన్పీ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రతాబలగాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

ఖన్పీ గ్రామంలో 17 మంది యుకెఎన్ఏ ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఆర్మీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌కు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ డాన్‌ పేరుతో గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. దాంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాదిని బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

మిగతా 11 మంది ఉగ్రవాదులు పారిపోయారు. దాంతో పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలింపులు కొనసాగుతున్నాయని, ఖన్పీ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 “మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు పశ్చిమాన దాదాపు 80 కి.మీ దూరంలో ఉన్న ఖాన్పి గ్రామంలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు ఎటువంటి కవ్వింపు లేకుండా కాల్పులు జరిపారు. భద్రతా దళాలు,  తిరుగుబాటు సంస్థ అయిన యుకెఎన్ఏ సాయుధ క్యాడర్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో, ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురిని తటస్థీకరించారు” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

“ఈ ఆపరేషన్  యుకెఎన్ఏ క్యాడర్లు ఇటీవల గ్రామ పెద్దను చంపడం, స్థానికులను బెదిరించడం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు వంటి దురాగతాలను అనుసరించింది. ఈ ఉగ్రవాదులను విజయవంతంగా తటస్థీకరించడం అనేది అమాయక పౌరులను రక్షించడం, అన్ని బెదిరింపులను తగ్గించడం, మణిపూర్‌లో శాంతి, భద్రతను నిర్ధారించడంలో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది” అని ఆ ప్రకటన వివరించింది.