టీకాల తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్ నుంచి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా న్యూసెలియన్ థెరప్యూటిక్స్ లిమిటెడ్ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం కలిగిన ఈ సంస్థ- సెల్, జీన్ థెరపీ రంగంలో కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీఆర్డీఎంఓ)గా పని చేయనుంది.
ఇది క్యాన్సర్, తలసీమియా, హీమోఫీలియా వంటి జెనెటిక్ వ్యాధులకు అవసరమైన చికిత్సా విధానాలను, మందులను అందించడం ఈ సీఆర్డీఎంఓ ప్రధాన ఉద్దేశం. భారత్ బయోటెక్ ప్రకారం, భవిష్యత్తులో ఔషధ ఆవిష్కరణలు బయోలాజికల్ పద్ధతులపై ఆధారపడతాయి. కొత్త చికిత్సా విధానాలు ప్రపంచవ్యాప్తంగా వృద్ధికి ప్రధాన చోదక శక్తులుగా మారతాయని అంచనా.
ఈ మార్పులో భాగంగా, సెల్ థెరపీలు ఆటోలాగస్, ఆలోజెనిక్, ఇన్‌వివో విధానాలు ఇకపై అరుదైన వ్యాధులకే కాకుండా విస్తృతమైన ఆంకాలజీ, ఇమ్యునాలజీ, రీజనరేటివ్ మెడిసిన్ రంగాలకూ విస్తరించనున్నాయి. ఉత్పత్తి, విశ్లేషణ, పంపిణీ సాంకేతికతలు మరింత పక్వత సాధించడంతో ఇవి విస్తృత స్థాయి ప్లాట్‌ఫారమ్‌లుగా మారే అవకాశం ఉంది.
భవిష్యత్తు ఔషధ ఆవిష్కరణలు బయోలాజికల్ రూపంలో ఉంటాయని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. సెల్ జీన్ థెరపీలు (సిజిటీఎస్) వాటిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పారు. భారత ఆరోగ్య వ్యవస్థలో ఆధునిక థెరపీ ప్లాట్‌ఫారమ్‌లను సమీకరించడం, అరుదైన, క్లిష్టమైన వ్యాధులకు సమానమైన వైద్య పరిష్కారాలను అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
క్లినికల్ దశ నుంచి కమర్షియల్ స్థాయి వరకు పూర్తిగా సేవలను అందిస్తామని న్యూసెలియన్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డాక్టర్ రఘు మలపాక తెలిపారు. ప్రపంచ నియంత్రణ ప్రమాణాలకు (ఎఫ్ డి ఏ, ఈఎంఏ) పూర్తిగా అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్లాస్మిడ్ డిఎన్ఏ, వైరల్ వెక్టర్లు, ఆటోలాగస్, ఆలోజెనిక్ సెల్ థెరపీల అభివృద్ధి, తయారీ సేవలు న్యూసెలియన్‌లో లభిస్తాయని తెలిపారు.

More Stories
జూబ్లీ హిల్స్ లో ఓట్ల చీలికతో బీజేపీ ‘కింగ్’
హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్!
చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది బలి