హర్మన్‌ప్రీత్‌ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా

హర్మన్‌ప్రీత్‌ సేనకు బీసీసీఐ రూ. 51 కోట్ల నజరానా
* ప్రపంచ విజేతలపై రాష్ట్రపతి, మోదీ ప్రశంసలు 

సీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను సాధించిన సుదీర్ఘ భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ఉమెన్‌ ఇన్‌ బ్లూ జట్టు బీసీసీ భారీ నజరానా ప్రకటించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించిన టీమ్‌ఇండియాకు రూ.51 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించారు.

విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు 44 లక్షల 80 వేల డాలర్లు (రూ.39కోట్ల 80లక్షలు), రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22లక్షల 40వేల డాలర్లు (రూ.19కోట్ల 90లక్షలు) లభించాయి. సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ.9కోట్ల 94లక్షలు) చొప్పున లభించాయి. 

ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ.6కోట్ల 21లక్షలు) చొప్పున ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ.2కోట్ల 48లక్షలు) చొప్పున లభించాయి. అదేవిధంగా ప్రపంచకప్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2లక్షల 50వేల డాలర్ల (రూ.2 కోట్ల 22లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్‌ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34వేల 314డాలర్ల (రూ.30లక్షల 47వేలు) చొప్పున లభించాయి.

ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణీలు చూపిన అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీమ్​ఇండియాకు అభినందనలు తెలిపారు.

విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము భారత అమ్మాయిలు చరిత్ర సృష్టించారని ఎక్స్‌ వేదికగా కొనియాడారు.
‘మహిళల అసమాన ప్రతిభ, అద్వితీయ ప్రదర్శనకు తగిన ఫలితం లభించింది. ఈ గెలుపు మహిళల క్రికెట్‌ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళుతుంది. ఫైనల్‌లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శన చేశారు. ప్లేయర్లందరికీ శుభాకాంక్షలు. ఈ చరిత్రాత్మక విజయం భవిష్యత్ తరాలను క్రీడలవైపు మళ్లిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు.

“ఈ విజయం లక్షలాది మంది అమ్మాయిలకు స్ఫూర్తిదాయక మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. ఉమెన్‌ ఇన్‌ బ్లూ చరిత్ర సృష్టించింది” లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కొనియాడారు. భారత మహిళా క్రికెట్‌ ప్రయాణంలో ఇదోక అద్భుతమైన క్షణమని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ పేర్కొంటూ దేశంలోని యువతులకు ఈ విజయం ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. నిర్భయంగా, నమ్మకంతో ఆడిన ఆట ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ అభినందించాడు.