నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేశ్‌కు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాముకు కూడా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. జోగి రమేశ్, రామును పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఐదేళ్ల పాటు అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయి అయినకాడకి దోచుకున్నారనే అభియోగాలు మూటగట్టుకున్న నేత జోగి రమేష్. ప్రత్యర్థి పార్టీల ముఖ్యనేతలే లక్ష్యంగా దాడులు చేయించటం సహా జగుప్సాకర పదజాలంతో తిట్ల దండకం అందుకున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో మాజీమంత్రి జోగి రమేష్ అరాచకాలు, దౌర్జన్యాలకు లెక్కే లేకుండా పో. బహిరంగ సభల్లోనూ జగుప్సాకర పదజాలంతో ప్రత్యర్థి పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు, వారి కుటుంబాలపై నోరు పారేసుకోవటం ఆయన నైజంగా మారింది.
వైఎస్సార్సీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ తన హయాంలో ఇసుక, మట్టి దందాలు, అగ్రిగోల్డ్ భూముల కబ్జా, నకిలీ మద్యం తయారీ వరకూ దేన్నీ వదల్లేదు. నాటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు ఇంటిపైకే దాడికి వెళ్లారు. అక్కడ నోటికొచ్చినట్టు తిడుతూ సవాళ్లు చేస్తూ జోగి చేసిన హంగామాకు ప్రతిఫలంగానే మంత్రి పదవి దక్కిందని అంటారు. దాంతోపాటు కృష్ణా జిల్లాలో మడ అడవుల విధ్వంసానికి ప్రధాన కారకుడు జోగేనని ఆరోపణలున్నాయి.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇసుక, బుసక తవ్వకాలను జోగి తన అనుచరులతో కొనసాగించారనే ఆరోపణలున్నాయి. తాను పోటీ చేసిన పెడన, మైలవరం, పెనమలూరు మూడు నియోజకవర్గాల్లోనూ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. అక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేలనూ ఇబ్బంది పెట్టేవారు. పెనమలూరు పరిధిలోని పారిశ్రామికవేత్తలు, స్థిరాస్తి వ్యాపారులు, భవన నిర్మాణదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల ఫండ్ ఇవ్వాలంటూ బెదిరించి కోట్లలో వసూళ్లు చేసినట్టు విమర్శలొచ్చాయి.

More Stories
శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం
పోలవరం నిర్వాసితులకు రూ.1000 కోట్లు విడుదల
నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో బాహుబలి రాకెట్!