జూబ్లీహిల్స్ లో ఓటమి భయంతో కాంగ్రెస్ బెదిరింపులు

జూబ్లీహిల్స్  లో ఓటమి భయంతో కాంగ్రెస్ బెదిరింపులు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తోందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మజ్లిస్ అభ్యర్థిని అద్దెకు తెచ్చుకుని నిలబెట్టినా, అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా, గెలుస్తామో లేదోనన్న అనుమానం, భయంతో బెదిరింపులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రకటన జరిగిన రోజే మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు మెహిదీపట్నంలో ఖబరస్థాన్ కోసం విలువైన ఆర్మీ స్థలాన్ని కేటాయించడం, ఎర్రగడ్డ కాలనీల మధ్య, బస్తీల మధ్య మరో స్థలాన్ని ఖబరస్థాన్‌కు ఇవ్వడం, ఇతర తాయిలాలతో ముస్లింలను బుజ్జగిస్తూ ఇతర వర్గాలను మాత్రం బెదిరిస్తోందని ఆయన మండిపడ్డారు.  

 
“వేల గజాల ఆర్మీ స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని ఖబరస్థాన్ కు ఇస్తారు. మరోవైపు బంజారాహిల్స్ లో పెద్దమ్మ గుడి కూలగొట్టి అమ్మవారి విగ్రహం మాయం చేస్తారు. ఆ గుడికి ఇవ్వడానికి ముందుకు రాని ప్రభుత్వం.. ఖబరస్థాన్ కోసం మాత్రం ఎకరాల కొద్ది భూములు ధారాదత్తం చేస్తారు” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. .

బీజేపీని విమర్శించడం ద్వారా అబద్ధాలు మాట్లాడటం ద్వారా మజ్లిస్ పార్టీ మెప్పు పొంది ఓట్లు రాబట్టుకోవాలని కుట్ర పన్నుతోందని పేర్కొంటూ సన్న బియ్యం ఇవ్వడం మానేస్తామంటూ బెదిరింపులకు దిగడం సీఎం హోదాలో మాట్లాడటం ఎంత వరకు సబబు? అని ప్రశ్నించారు.  ఇది ఉపఎన్నికలో ఓడిపోతామనే  ఫ్రస్టేషనా? లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయమా? అని నిలదీశారు. 

 
6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయినా సిగ్గు పడకుండా తిరిగి బరితెగించి ఓటర్లనే బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2 వేలు, స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, పొదుపు సంఘాలకు రూ.5 లక్షలు, బీసీ సంక్షేమానికి లక్ష కోట్లు ఇవ్వకుండా.. అమల్లో ఉన్న పథకాలను రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారంటే కాంగ్రెస్ నిజస్వరూపం ఏంటో అర్థం అవుతోందని ఆయన చెప్పారు.

ఢిల్లీలో బడేమియా రాహుల్ గాంధీ, గల్లీలో చోటేమియా రేవంత్ రెడ్డి దొందూ దొందే అంటూ ఆర్మీ అంటే వీళ్లిద్దరికీ ఎప్పుడూ చులకన భావమే, ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడటం అలవాటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడేవారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.  పాకిస్తానోడు ముడ్డి మీద తంతే అంటూ సైనికులను ఉద్దేశించి మాట్లాడతారా? అంటూ నిలదీశారు. 

 
ముఖ్యమంత్రి సీటు రక్షించుకోవడం కోసం నెహ్రూ కుటుంబ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. రాహుల్ ఆలోచనల ప్రకారం మాట్లాడితే  ‘సీఎం సీటు సేఫ్’ అని రేవంత్ భావిస్తున్నట్లున్నారని పేర్కొన్నారు. సైనికులకు వ్యతిరేకంగా  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మీని కించపరచడంలో బీఆర్ఎస్ కూడా తక్కువేమీ తినలేదని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంతలు పడిన ఆ రోడ్లలో రెండు కిలోమీటర్లు నడిచి ప్రజలను ఓటేయమని కోరాలని ఆయన సవాలు విసిరారు. ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తానంటూ పదేపదే చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఫాం హౌజ్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

తప్పుడు హామీలు ఇవ్వడం రెండు పార్టీలకు అలవాటుగా మారిందని చెబుతూ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు.. అనేక బస్తీలు ఉన్నాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. వాటిని అభివృద్ధి చేయకుండా గొప్పలు చెప్పుకొంటే సరిపోదని పేర్కొంటూ అనేక బస్తీల్లో వీధి లైట్లు కూడా వెలగట్లేదని, డ్రైనేజీ రోడ్లపై పారుతోందని విమర్శించారు. రోడ్లపై గుంతలు పడి నడవలేకపోతున్నారని పేర్కొంటూఈ పనులు చేసి అప్పుడు ఓటు అడగాలని స్పష్టం చేశారు.