కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!

కుటుంభం కోసం కాదు.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేశా!

తన కుటుంబం కోసం ఎప్పుడూ తాను పని చేయలేదని,  తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి పనిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసినట్లు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక వీడియో సందేశాన్ని శనివారం విడుదల చేశారు. 2005లో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ‘బీహారీ’గా ఉండటం అవమానకరమైన విషయమని ఆయన గుర్తు చేశారు. 

“నా ప్రియమైన బీహార్ సోదర సోదరీమణులారా, 2005 నుంచి మీకు సేవ చేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. ఆ సమయంలో బీహార్‌ను మనం పొందిన పరిస్థితి అవమానకరమైన విషయం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి మీకు పగలు, రాత్రి సేవ చేశాం” అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్యం, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వ్యవసాయంతోపాటు యువతకు అవకాశాలను మెరుగుపరిచినట్లు చెప్పారు. కాగా, మహిళలను చాలా బలంగా మార్చామని, వారు ఇకపై ఎవరిపైనా ఆధారపడరని నితీశ్‌ కుమార్ తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 

“గత ప్రభుత్వం మహిళల కోసం ఏం చేయలేదు. కానీ మేము వచ్చాక మహిళల సాధికారత కోసం ఎన్నో పనులు చేశాం. మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా వారే సొంతంగా పిల్లలు, కుటుంబాన్ని చూసుకునే స్థితికి తీసుకువచ్చాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం పనిచేశాం” అని తెలిపారు. “హిందూ, ముస్లిం, ఉన్నతవర్గాలు, బలహీన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, దళితులు, మహాదళిత్ ఇలా ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేశాం. మేం మొదటి నుంచీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం యత్నించాం” అని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఇప్పుడు బీహారీగా ఉండటం అవమానకరమైన విషయం కాదని, గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొంటూ రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీశ్‌ కుమార్‌ తెలిపారు.  ఈ క్రమంలో కాంగ్రెస్- ఆర్జేడీలపై నీతీశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు.

బిహార్ అభివృద్ధి కేవలం ఎన్డీయేతోనే సాధ్యమని నీతీశ్ చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిహార్‌ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ఉండటం వల్లే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌ అభివృద్ధి ఎన్డీయే అధికారంలో ఉంటేనే అవుతుందన్న ఆయన, తమకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

“మాకు మరో అవకాశం ఇవ్వండి. దీని తర్వాత మరిన్ని పనులు జరుగుతాయి. ఇది బీహార్‌ను ఎంతగానో అభివృద్ధి చేస్తుంది. అగ్ర రాష్ట్రాలలో చేర్చుతుంది” అని రాష్ట్ర ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు.  ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు.