కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు

కేరళలో ముస్లింలకు 10 శాతం, క్రిస్టియన్లకు 6 శాతం రిజర్వేషన్లు

*  ఓబీసీ రిజర్వేషన్ విధానంపై జాతీయ కమిషన్ ఆగ్రహం

కేరళలో ఓబీసీ రిజర్వేషన్ విధానంపై భారీ వివాదం చెలరేగింది. పినరయి విజయ్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం మత ప్రాతిపదికన రిజర్వేషన్ కోటాలు కేటాయిస్తోందనే ఆరోపణలను నేషనల్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కమిషన్ (ఎన్‌సీబీసీ) తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై కేరళ ప్రభుత్వం 15 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఎన్‌సీబీసీ ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ ఆదేశాలు జారీ చేశారు.

హన్స్‌రాజ్ అహిర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేరళ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని మత వర్గాలకు రిజర్వేషన్లను విస్తరిస్తోందని అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య రిజర్వేషన్ విధాన సూత్రాలను ఉల్లంఘిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన జరిగిన సమీక్షా సమావేశంలో కేరళలో రిజర్వేషన్ల కేటాయింపులో లోపాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
 
ఈ లోపాల ప్రకారం ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను మైనారిటీ వర్గాలకు పంచాలని ప్రతిపాదనలు చేశారు. ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 10 శాతం, క్రైస్తవులకు 6 శాతం కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ పద్ధతి వల్ల నిజమైన ఓబీసీ వర్గాల హక్కులు ఉల్లంఘన జరుగుతోందని, వారి ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ అభిప్రాయపడింది.
 
ఇక ఈ మతపరమైన రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించిన చట్టపరమైన సమర్థన, సమగ్ర సాక్ష్యాలను అందించాలని ఎన్‌సీబీసీ ఛైర్మన్ కేరళ ప్రభుత్వాన్ని అధికారికంగా కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, అధికారులు కమిషన్‌కు అవసరమైన డాక్యుమెంట్‌లను సమర్పించడంలో విఫలం అయ్యారని తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ నిజమైన ఓబీసీ లబ్ధిదారుల హక్కులను పరిరక్షించడానికి, రిజర్వేషన్ల ప్రయోజనాలు నిజంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే అందేలా చూసేందుకు నిబంధనల ప్రకారం కులాలను చేర్చాలని స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల చట్టబద్ధతను కమిషన్ తీవ్రంగా ప్రశ్నిస్తోంది.