భారత్‌లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ

భారత్‌లోనే నిఫా నిరోధక ‘యాంటీబాడీస్’ తయారీ

నిఫా వైరస్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను భారత్‌లోనే తయారుచేసే దిశగా అడుగులు పడుతున్నాయి. రోగుల శరీరంలోని నిఫా వైరస్‌ను నిర్వీర్యం చేసే మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే అభివృద్ధి చేసింది. వాటితో జంతువులపై ప్రయోగ పరీక్షలనూ విజయవంతంగా పూర్తి చేసింది. 

ఇప్పుడు వాటిని భారత్‌లో తయారు చేసే ఆసక్తి కలిగిన వాణిజ్య భాగస్వాముల కోసం ఐసీఎంఆర్ అన్వేషిస్తోంది. నిఫా వైరస్ ప్రబలే సీజన్లలో అత్యవసర ప్రాతిపదికన మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను తయారుచేసి అందించగల కంపెనీలతో జట్టు కట్టేందుకు రెడీ అవుతోంది. ఈమేరకు ‘ఆసక్తి వ్యక్తీకరణ’ డాక్యుమెంట్‌ను ఐసీఎంఆర్ విడుదల చేసింది.

మోనోక్లోనల్ యాంటీబాడీస్‌‌ను భారత్‌లోనే అభివృద్ధి చేసి, తయారు చేయగల అర్హత ఉన్న సంస్థలతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని వెల్లడించింది. ఇందుకు ముందుకొచ్చే సంస్థలకు మోనోక్లోనల్ యాంటీబాడీస్‌‌ తయారీతో ముడిపడిన అన్ని దశల్లోనూ తమ నిపుణులు సలహాలను, సాంకేతిక సహాయాన్ని అందిస్తారని తెలిపింది.

”మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ అనేవి నిఫా వైరస్‌పై సమర్ధంగా పనిచేస్తున్నాయని మేం గుర్తించాం. ‘ఎం102.4’ అనే పూర్తిస్థాయి మానవ మోనోక్లోనల్ యాంటీబాడీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని తేల్చాం. ఇది నిఫా వైరస్‌లోని ‘జీ గ్లైకో ప్రొటీన్’పై దాడి చేస్తోంది. దీని పర్యవసానంగా మానవ శరీర కణాల సిగ్నలింగ్ రిసెప్టర్లు ‘ఎఫ్రిన్-బీ2/బీ3’లతో నిఫా వైరస్ సమన్వయం చేసుకోవడం సాధ్యపడదు. ఫలితంగా మానవ శరీర కణజాలంలోకి నిఫా వైరస్ చొరబాటు ఆగిపోతుంది” అని  ఐసీఎంఆర్ వెల్లడించింది.

జంతువులపై జరిపిన ప్రయోగ పరీక్షల్లోనూ ‘ఎం102.4’ మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ చాలా బాగా పనిచేశాయని పేర్కొంటూ ఇప్పటికే భారత్‌లోని కేరళతో పాటు ఆస్ట్రేలియాలోని పలువురు రోగులకు వీటితో చికిత్స అందించారని ఐసీఎంఆర్ తెలిపింది.

”’ఎం102.4′ మోనోక్లోనల్ యాంటీబాడీస్‌తో మనుషులపైనా ట్రయల్స్ జరపబోతున్నాం. ఏ తరహా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. లైసెన్సుల జారీకి ఇంకా చాలా ఏళ్ల సమయం పట్టొచ్చు. నిఫా వైరస్ బారినపడుతున్న వారిలో చాలామంది చనిపోతున్నారు. ప్రత్యేకించి ఆరోగ్య కార్యకర్తలకు ఎక్కువ ముప్పు ఉంది” అని తెలిపారు. 

“ప్రస్తుతం మార్కెట్‌లో లైసెన్స్‌డ్ ‘నిఫా’ నిరోధక వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. అందుకే భారత్‌లో నిఫా కట్టడి కోసం మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాల్సిన అవసరం చాలా ఉంది. నిఫా ఇన్ఫెక్షన్ సోకిన వారికి వీటితో వీలైనంత త్వరగా చికిత్స చేస్తే, ప్రాణగండం తప్పుతుంది. జంతువులపై ట్రయల్స్‌లో ఈవిషయం తేలింది. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ వల్ల రోగి శరీరంలో వైరల్ లోడ్ తగ్గుతుంది. నిఫా ఇన్ఫెక్షన్ వ్యాప్తి వేగం సైతం తగ్గుముఖం పడుతుంది” అని ఐసీఎంఆర్ పేర్కొంది.