కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
 
కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో స్పాట్ లోనే 10 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో 9 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. పలువురు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. స్పృహతప్పి పడిపోయిన వారిని కాశీబుగ్గలోని ఆస్పత్రికి తరలించారు. కార్తీక మాసం, ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడిపడటంతో భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. 

ఆలయానికి వచ్చిన వారిలో ఎక్కువమంది మహిళా భక్తులు ఉన్నారని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని 12 ఎకరాల్లో నిర్మించినట్లు చెబుతున్నారు. ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం దక్కలేదని కాశీబుగ్గలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 12 ఎకరాల్లో రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రకటించారు. “ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. మృతులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తాము” అని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. “శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను” అని తెలిపారు. 

“ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరాను'” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇటు దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఈ తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ తెలిపారు. “ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైంది. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది” అని చెప్పారు. కాగా,  ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడుతుందని తెలిపారు.

ప్రతి వారం 1500 నుంచి 2 వేల మంది భక్తులు దర్శనం కోసం వస్తారని హోంమంత్రి అనిత తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంటుందని, 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్‌ ఊడిపడిందని, రెయిలింగ్‌ ఊడిపడటంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ఆమె వివరించారు. తొక్కిసలాటలో మహిళా భక్తులు మృతిచెందడం బాధాకరం అని పేర్కొంటూ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఆమె తెలిపారు. గాయపడినవారికి ప్రాణాపాయం లేదని తెలుస్తోందని హోంమంత్రి తెలిపారు.