టీటీడీ పరకామణిలో డాలర్ల చోరీ కేసును రాజీ చేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల (అవార్డు) చట్టబద్ధతను తేల్చేందుకు సుమోటో వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది.
చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీ రవికుమార్‌తోపాటు ప్రతివాదులైన పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (ఏవీఎస్వో) వై.సతీశ్‌కుమార్, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, తిరుపతి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, సీఐడీ డీజీ, టీటీడీ ఈవో, సీవీఎస్వో, తిరుమల మొదటి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది.
దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ సుభేందు సామంతతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఉత్తర్వులిచ్చింది. 2023లో వైఎస్సార్సీపీ హయాంలో టీటీడీ పరకామణిలో జరిగిన కుంభకోణంపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్ట్ ఎం.శ్రీనివాసులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
పరకామణిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సీవీ రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు, బంగారం అపహరించారని ఆరోపించారు. దీనిపై 2023 ఏప్రిల్ 29న తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో సతీశ్‌కుమార్ ఆ తర్వాత అనూహ్యంగా నిందితుడు రవికుమార్‌తో స్వచ్ఛందంగా లోక్ అదాలత్ (తిరుపతి మొదటి తరగతి రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్) వద్ద రాజీ చేసుకున్నారని వివరించారు.
అదే విధంగా గత నెల 27వ తేదీన ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించారు. చోరీకి పాల్పడిన రవికుమార్, ఆయన కుటుంబసభ్యులు కూడబెట్టిన స్థిర, చరాస్తులతోపాటు బ్యాంక్ ఖాతాలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు.
రవికుమార్, ఆయన కుటుంబసభ్యులు విక్రయించిన, ఇతరులకు బదలాయించిన ఆస్తులపైనా సమగ్ర దర్యాప్తును చేపట్టాలని ఎం.శ్రీనివాసులు (జర్నలిస్ట్) స్పష్టం చేశారు. చోరీ కేసు రాజీకి అనుమతిస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చేందుకు ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించే నిమిత్తం తీర్పు ప్రతిని సీజే వద్ద ఉంచాలని ఆదేశించారు. దీంతో సీజే ఈ వ్యవహారాన్ని జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు, జస్టిస్ సుభేందు సామంతలతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు.

More Stories
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట .. 10 మంది మృతి
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం