ప్రజాస్వామ్యంలో వర్గ రాజకీయాలు పెరిగిపోతున్నాయని భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పాలనపై ప్రసంగిస్తూ సమాజాన్ని విభజించడమే నేటి రాజకీయ ధోరణిగా మారిందని తీవ్రంగా విమర్శించారు. “…ఏమి జరిగిందంటే, ప్రజాస్వామ్యం అత్యంత ప్రభావవంతమైన, అత్యంత శాశ్వతమైన పాలనా వ్యవస్థలలో ఒకటిగా నిరూపించబడినప్పటికీ, అది దాని స్వంత సమస్యలను సృష్టించింది. ఇది పక్షపాత రాజకీయాలకు దారితీస్తుంది. విభజనలు ఉన్నాయి. విభజన అనేది చాలా విచిత్రమైన విషయం” అని తెలిపారు.
ఒక ఉదాహరణతో ఈ విషయాన్ని వివరిస్తూ “ఒక ప్రాంతంలో 100 మంది జనాభా ఉంటే అందులో నా అనుచరులు 25 మంది ఉన్నా, మిగిలిన 75 మందిని 20 మంది కంటే తక్కువ ఉన్న అనేక చిన్న విభాగాలుగా చీల్చగలిగితే నేను అధికారంలోకి రాగలను. ఇక్కడ లక్ష్యం 51 శాతం సాధించడం కాదు. మిగిలిన సమాజాన్ని సాధ్యమైనంత వరకు విచ్ఛిన్నం చేయడమే. ఈ విచ్ఛిన్నమే పెద్ద ప్రమాదం” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యం గొప్ప ఫలితాలను ఇస్తున్నప్పటికీ దానిలోని ఈ ప్రతికూల కోణాలను మనం గమనించి, వాటిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో డబ్బు పోషిస్తున్న పాత్రపైన కూడా దోవల్ దృష్టి సారించారు. చట్టబద్ధంగా లేదా చట్టవిరుద్ధంగా అయినప్పటికీ రాజకీయాల్లో డబ్బు ప్రభావం తిరుగులేనిదిగా మారిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.
“మీ ఆదర్శవాదం, దార్శనికత, దేశభక్తికి డబ్బు నుంచి బలమైన మద్దతు ఉండాలి” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా స్థానిక, చిన్న వర్గ ప్రయోజనాలు తరచుగా జాతీయ ప్రయోజనాలను కప్పి పుచ్చుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్గ ప్రయోజనం అంటే తాను అవినీతిపరమైన కోణంలో మాట్లాడటం లేదని, కానీ పెద్ద జాతీయ ప్రయోజనం కంటే ఒక స్థానిక, చిన్న ప్రయోజనానికి ఎక్కువ ప్రాధాన్యత లభించడం ప్రమాదకరం అని ఆయన వివరించారు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి దోవల్ కొన్ని పరిష్కారాలను కూడా సూచించారు. “మనం మన చట్టాలు, నిబంధనలు, విధానాల వ్యవస్థ మొత్తాన్ని పరిశీలించి, వాటిని మరింత ప్రజలకు అనుకూలంగా మార్చాలి” అని ఆయన చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన విధానాలు, ప్రణాళికలు ఉండాలని, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలని, ప్రతి పౌరుడికి భద్రతా భావం కల్పించాలని ఆయన ఉద్ఘాటించారు.
పాలనలో ప్రభుత్వఅధికారాన్ని తగ్గించడంలో సాంకేతికత చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతోందని అజిత్ దోవల్ పేర్కొన్నారు. ఎక్కువ పారదర్శకత, జవాబుదారీతనం, సామాన్యులకు సేవలను అందించడం, ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ధారించడానికి సాంకేతికతను ఉపయోగించాలని ఆయన నొక్కి చెప్పారు. సైబర్, సాంకేతికత కలిగించే ఇతర ముప్పుల నుండి పౌర సమాజాన్ని రక్షించాలని ఆయన కోరారు.

More Stories
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్లో మరో శీష్ మహల్
స్వామి దయానంద సరస్వతి దార్శనికుడు
బీహార్ ఎన్నికల ఎన్డీయే మేనిఫెస్టోలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు