400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!

400 కిలోల బంగారంతో సహా రూ 400 కోట్ల మావోయిస్టుల నిధులు!
* అగ్రనాయకులు లొంగిపోతున్నా అంతుబట్టని వారి భారీ నిధులు!
 
ఆపరేషన్ కగార్ వల్ల ముఖ్య మావోయిస్టు నేతల నుంచి సాధారణ దళ సబ్యుల వరకు చాలా మంది వందల సంఖ్యలో లొంగి పోతూ ఉండటం, మరోవంక అనేకమంది పోలీస్ కాల్పులలో చనిపోతూ ఉండడంతో ఇక అడవులలో తుపాకీలతో పోరాడలేమని మావోయిస్టులు స్పష్టం చేస్తూ వస్తున్నారు. లొంగిపోతున్న లేదా చనిపోతున్న నేతలు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొంటున్నప్పటికీ, వారి పలు సంవత్సరాలుగా సేకరిస్తూ వస్తున్న భారీ నిధులు ఎక్కడ ఉన్నాయన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 
లొంగిపోయిన కీలక నేతలు కొందరు అందించిన సమాచారం మేరకు 400 కిలోల బంగారంతో పాటు రూ 400 కోట్లకు పైగా నిధులు వారి వద్ద ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఒక అంచనాకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం వీటిని ఎక్కడ దాచారో తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా సమయంలో దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన సమయంలో మావోయిస్టులు భారీగా నిధులు వసూలు చేశారని తెలిసింది.
అవకాశం ఉన్నచోట్లంతా డబ్బును పెట్టుబడులుగా, బ్యాంకు ఖాతాల్లో, లాకర్లలో దాచుకున్న మావోయిస్టుపార్టీ చివరకు ఎక్కడ దాచుకోవాలో తోచక బంగారం రూపంతో పాటు నగదు రూపంలో అడవుల్లో డంపుల్లో దాచిపెట్టినట్లు లొంగిపోయిన మావోయిస్టునేతలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.  రోజువారీ వ్యవహారాలు నడపటానికి, ఆయుధాలు సమకూర్చుకోవటానికి, వైద్యారోగ్యంతో పాటు అనేక అవసరాలకోసం మావోయిస్టులు  రెగ్యులర్ గా నిధులు సేకరిస్తుంటారని అందరికీ తెలిసిందే. 
కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతల నుండి భారీగా నిధులు సేకరిస్తుంటారు. తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలోని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, చివరకు అన్ని రాజకీయ పార్టీల నాయకుల నుండి క్రమం తప్పకుండా `కప్పం’ మాదిరిగా మావోయిస్టులు నిధులు వసూలు చేస్తుంటారు. ఎవరైనా ఎదురు తిరిగితే హత్యలకు సహితం పాల్పడుతూ ఉండేవారు.
తాజాగా అందుతున్న సమాచారం ఆధారంగా మావోయిస్టులు తాము వసూళ్ళుచేసిన వందల కోట్ల రూపాయల్లో అవసరాలకు వాడుకోగా, మిగిలిన మొత్తాలను వందలాది మంది బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయడం, బ్యాంకు లాకర్లలో దాచడం లేదా బంగారు రూపంలో దాచుకున్నట్లు కనుగొన్నారు.  ఆయా నిధులను పార్టీ నేతల కుటుంభ సభ్యులు, సానుభూతిపరులు, అర్బన్ నక్సలైట్ల పేర్లతో వందలకొద్దీ బ్యాంకు ఖాతాలలో దాచారని భావిస్తున్నారు. 
బ్యాంకులలో దాచేందుకు సాధ్యం కానీ పక్షంలో బంగారంగా మార్చి అడవులలో దాచారని తెలుస్తున్నది. ఆ విధంగా 400 కిలోలకు పైగా బంగారం వారి ఆధీనంలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.  ఇన్నాళ్లు మావోయిస్టులు సేకరించిన కోట్ల రూపాయల నగదు , ఆస్తులు ఎక్కడ, ఎవరి ఆధీనంలో ఉన్నాయి? డంపుల మాటేమిటి? అని ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

గతంలో మావోలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌లోని కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తల నుంచి భారీ స్థాయిలోపార్టీ నిధులు వసూలు చేశారు. ఆ మొత్తాన్ని కేంద్ర కమిటీకి పంపిస్తుంటారు. అలానే మావోయిస్టు పార్టీకి నిధుల సేకరించేందుకు గాను పెద్ద స్థాయిలో నెట్ వర్క్ ఉందన్న విషయం జాతీయ విచారణ సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తులో వెలుగు చూసింది. 

 
ఇప్పుడు మావోయిస్టులకు నిధులు అందకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేసినా సరే వారి వద్ద ఉన్న నిధులతో మరో ఐదారు సంవత్సరాలు పార్టీని నడపొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  గతంలో ఒడిశా, ఝార్ఖండ్ వంటి అటవీ ప్రాంతాలలో పెద్ద ఎత్తున రైతులను గంజా సాగుకు ప్రోత్సహించి, తద్వారా వేల కోట్ల ఆదాయంను మావోయిస్టులు సమకూర్చుకొనేవారని వెల్లడైంది. 
 
2015లో ఒక అంచనా ప్రకారం ఒక సంవత్సరంలో ఆ విధంగా రూ 10,000 కోట్లకు పైగా విలువైన గంజా సాగు చేయించారు. ఆ గంజా అమ్మకాలలో భారీ మొత్తాలను మావోయిస్టులు తమ పార్టీ నిధులుగా సమకూర్చుకొనేవారు. అయితే, ఆ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గంజా సాగును చాలావరకు కట్టడి చేయగలిగాయి.
 
మావోయిస్టులు తమకు అందిన డబ్బును రెండు రకాలుగా మార్చినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ప్రధానంగా పార్టీ సానుభూతిపరులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల పేరటి బ్యాంక్ అకౌంట్స్ తెరిచి వాటిల్లో డిపాజిట్ చేయడంతో పాటు కొందరి పేరు మీద కంపెనీలు, మరి కొన్ని సార్లు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు జమ చేశారని తెలుస్తోంది. మిగిలిన నగదును బంగారం రూపంలోకి మార్చేశారని అధికారులు భావిస్తున్నారు.
 
మావోయిస్టులు సమకూర్చుకున్న బంగారం అంతా అడవుల్లోని డంపుల్లో ఉందా? లేదంటే బయట ఎక్కడైనా దాచారా? అనే అనే అంశంపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు దృష్టి సారించాయి. ఇప్పటికే ఈడీ అధికారులు పలు రాష్ట్రాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా వారితో పాటు వారి కుటుంబ సభ్యుల ఖాతాలో భారీ ఎత్తున నగదు డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. అలానే లొంగిపోతున్న మావోయిస్టుల తమ దగ్గర ఉన్న ఆయుధాల గురించే కాక నగదు గురించి కూడా లెక్కలు చెప్పాకే బయటకు వస్తున్నారని తెలుస్తోంది.
ఝార్ఖండ్ కు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకుడు దినేష్ గోపేను ఆగస్టులో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో దినేష్ భార్య, బంధువులు పేరుతో డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటిల్లో రు. 20 కోట్లు దాచినట్లు వెల్లడైంది. బీజాపూర్ పోలీసులు మూల్ వాసీ బచావో మంచ్ కు చెందిన ఇద్దరు సభ్యుల బ్యాంకు ఖాతాల్లో రు. 6 లక్షలు డిపాజిట్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

గతంలో మావోయిస్టు స్పెషల్ ఏరియా కమిటి సభ్యుడు ప్రద్యుమ్న శర్మ బంధువు ఒకమ్మాయి చెన్నైలోని మెడికల్ కాలేజీలో చదివింది. ఆమె చదువుకు అవసరమైన రూ. 1. 13 కోట్లు బ్యాంకు ద్వారానే జమ ఐనట్టు నిఘా వర్గాలు కనుగొన్నాయి.  అంతేకాకుండా, పార్టీకి సానుభూతి చూపే వ్యక్తుల పేర్లతో నకిలీ సంస్థలు స్థాపించి, వాటి ద్వారా కోట్ల రూపాయలు మళ్లించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
ఈ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా బహిర్గతం చేయడానికి నిఘా సంస్థలు గట్టిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  మావోయిస్టులకు అనుబంధంగా పనిచేస్తున్న పలు `ప్రజా సంఘాలు’కు చెందిన నాయకులు, వారి కుటుంభం సభ్యులు, `అర్బన్ నక్సలైట్లు’గా భావించే వారు సహితం ఈ నిధులలో భారీ మొత్తాలను తమ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని తెలుస్తున్నది.