త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల

త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల త్వరలో భారత్‌లో ప్రకటించనున్నారు. డిసెంబర్‌లో ఢిల్లీ, ముంబయితో పాటు బెంగళూరు నగరాలను ఆయన ఈ పర్యటనలో సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఉద్యోగులను కలుస్తారని పలు నివేదికలు తెలిపాయి. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం సత్య నాదెళ్ల తన పర్యటనలో అనేక కీలకమైన ఏఐ సంబంధిత సమావేశాల్లో ప్రసంగిస్తారని పేర్కొంది. 
 
కంపెనీ అధికారికంగా ఆయన పర్యటనను ధ్రువీకరించనప్పటికీ ఈ పర్యటన మైక్రోసాఫ్ట్‌కు వ్యూహాత్మకంగా కీలకమైందిగా భావిస్తున్నారు.  భారత్‌-అమెరికా సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ఇటీవల రెండు దేశాలు విభేదాలను పక్కనపెట్టి సాంకేతిక భాగస్వామ్యంపై దృష్టి సారిస్తున్నాయి. 
 
మరో వైపు భారత ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా యాప్‌లు, సేవలను ప్రోత్సహిస్తున్నది. జోహో కార్పొరేషన్ వంటి భారతీయ కంపెనీలు మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలకు ప్రత్యామ్నాయంగా నిలువబోతున్నాయి. ఇదిలా ఉండగా.. సత్య నాదెళ్ల ఈ ఏడాది జనవరిలోనూ భారతలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా దేశంలో ఏఐ రంగంలో మూడు బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని పెట్టలనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ సీఈవో ప్రకటించారు.

 
ఈ పర్యటన ఆయన దార్శనికతను ముందుకు తీసుకెళ్లే దిశలో మరో ముందడుగుగా భావిస్తున్నారు. భారత్‌లో ఏఐ రంగంలో పోటీ వేగంగా పెరుగుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించడానికి రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని గూగుల్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ మద్దతు ఉన్న ఓపెన్‌ ఏఐ భారతీయ వినియోగదారులకు చాట్‌జీపీటీ గో  ఏడాది ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను ప్రకటించింది. నాదెళ్ల పర్యటన భారతదేశంలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీ అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.