 
                అమెరికాలో వలసదారులపై కఠిన విధానాలు కొనసాగిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇకపై వలసదారుల పని అనుమతులను ఆటోమేటిక్‌గా రెన్యువల్ చేసే విధానానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయులతో పాటు వేలాది మంది విదేశీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2025 అక్టోబర్ 30 లేదా ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని స్పష్టం చేసింది. అయితే, ఈ తేదీకి ముందు రీన్యువల్ కోసం దరఖాస్తు చేసిన వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవని పేర్కొంది.
ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. గతంలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వలసదారులు తమ వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు ఉద్యోగం చేసుకునే వీలు ఉండేది. పర్మిట్ రెన్యువల్ దరఖాస్తు ప్రాసెస్ పూర్తయ్యే వరకు ఆ తాత్కాలిక పొడిగింపు వారికి రక్షణగా ఉండేది.
అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ సౌకర్యాన్ని నిలిపివేసి, వలసదారులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘వర్క్ పర్మిట్ గడువు ముగియడానికి కనీసం 180 రోజుల ముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేయాలి. ఆలస్యమైతే తాత్కాలికంగా ఉద్యోగ అనుమతి రద్దు అయ్యే అవకాశం ఉంది’ అని అధికారులు హెచ్చరించారు. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఎడి) అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే అధికారిక పత్రం. ఇది ఉన్నవారికి మాత్రమే అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే హక్కు ఉంటుంది. ఈ పత్రం గడువు ముగిసిన తర్వాత ఉద్యోగం కొనసాగించాలంటే తప్పనిసరిగా రెన్యువల్ చేయాలి.
అయితే, గ్రీన్‌కార్డ్‌తో శాశ్వత నివాసం పొందిన వారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హెచ్-1బీ, ఎల్-1బీ, ఓ, పీ వంటి వీసాలతో ఉన్న నాన్ ఇమిగ్రెంట్ ఉద్యోగులు కూడా వేరుగా ఈఎడి కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కానీ గ్రీన్‌కార్డ్ పెండింగ్‌లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, అలాగే ఎఫ్-1, ఎం-1 వీసాలతో చదువుకునే విద్యార్థులు లేదా డిపెండెంట్ వీసాతో ఉన్నవారు అమెరికాలో పని చేయాలనుకుంటే తప్పనిసరిగా ఈఎడి తీసుకోవాలి.





More Stories
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్‌పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు
థాయిలాండ్ కు పరారైన 500 మంది భారతీయులు