 
                పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నవంబరు 23న జరిగే ఈ వేడుకలకు హాజరు కావాలని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, మంత్రులకు శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆహ్వానాలు అందజేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. 
అయితే ఈ ఉత్సవాలను రాష్ట్ర వేడుకగా నిర్వహించడంపై ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భారత హేతువాద సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని ఆపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. ప్రభుత్వ నిధులను ఇలా మతపరమైన కార్యక్రమాలకు మళ్లించడానికి వీలు లేదంటూ ఆ పిటిషన్‌లో అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పటిషనర్‌ను హెచ్చరించింది.
సత్యసాయి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహిస్తే తప్పేముందని భారత హేతువాద సంఘాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సత్యసాయి ట్రస్ట్ ద్వారా మూడు జిల్లాలకు తాగునీరు అందించారని, ఈ విషయం రాష్ట్రానికి వచ్చిన కొత్తలో తన సహచరుల ద్వారా తనకు తెలిసిందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. అంతే కాకుండా ఆసుపత్రులు, విద్యాసంస్థలు సైతం స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని పిటిషనర్‌కు ఈ సందర్భంగా హైకోర్టు గుర్తుచేసింది.
ఇలాంటి విశిష్ట వ్యక్తులను గౌరవించడంలో తప్పేముందంటూ వెంకట సుబ్బయ్యను సూటిగా ప్రశ్నించింది. తాను దాఖలు చేసిన పిల్‌ను వెంకట సుబ్బయ్య వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. లేకుంటే ఖర్చులు విధించి పిల్ కొట్టేస్తామని హెచ్చరించింది. నిజంగా ప్రజా ప్రయోజనం ఉన్న వ్యాజ్యాలపై దృష్టి సారించాలని హితవు పలికింది.
విచారణ సందర్భంగా భారత హేతువాద సంఘం తరఫున వాదించిన న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ లౌకిక రాజ్యంలో మతపరమైన కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు వినియోగించడానికి వీలు లేదని పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్ ప్రణతి కౌంటర్ వాదనలు వినిపించారు. వివిధ రకాలుగా ప్రజా సేవ చేసిన 22 మంది వ్యక్తుల జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు నివేదించారు. 
సత్యసాయి నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో పలు సామాజిక సేవలు అందుతున్నాయని వెల్లడించారు. శ్రీ సత్యసాయి సేవలను  పరిగణనలోకి తీసుకొని జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమార్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సరైన అధ్యయనం చేయకుండా ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా జారీ చేస్తుందని పిటిషనర్‌ను ప్రశ్నించారు.
                            
                        
	                    




More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
మొంథా తుపాను ప్రాథమిక నష్టం రూ.5265 కోట్లు