ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్​పింగ్​ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు

ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్​పింగ్​ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా దేశాధ్యక్షుడు అయ్యాక తొలిసారిగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌‌తో భేటీ అయ్యారు. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఈ ఇరువురు నేతలు దక్షిణ కొరియాలోని బూసాన్ వేదికగా గురువారం రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనాపై విధించిన టారిఫ్‌లను 10శాతం మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి 32వ ఏపీఈసీ సదస్సుకు హాజరయ్యేందుకు వీరిద్దరు బూసాన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా – చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే లక్ష్యంతో ట్రంప్, జిన్‌పింగ్ భేటీ అయ్యారు.

తన స్నేహితుడు, చాలాకాలంగా చైనాకు అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్‌‌ను కలవడాన్ని గౌరవపూర్వక అంశంగా భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య  జిన్‌పింగ్‌ ఒక గొప్ప దేశానికి మంచి నాయకుడని, తమ దేశాల మధ్య అద్భుతమైన సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తామని ట్రంప్ చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రంప్‌ను కలిసినందుకు తనకు ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌‌ తెలిపారు. 

తమ ఇద్దరి మార్గదర్శకత్వంలో ఇరుదేశాల సంబంధాలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం అనేది సాధారణ విషయమేనని, అయితే, ఇరుదేశాల సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని ఆయన సూచించారు.

ప్రపంచ శాంతిపై ట్రంప్‌ శ్రద్ధ వహిస్తున్నారని చైనా అధినేత కొనియాడారు. కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలను ఆపేందుకు ట్రంప్‌ చేస్తున్న శాంతి ప్రయత్నాలను జిన్‌పింగ్‌ ప్రశంసించారు. ఇటీవల గాజా కాల్పుల విరమణకు చేసిన కృషికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం అనేక కఠిన సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ క్రమంలో ప్రధాన దేశాలైన చైనా, అమెరికా ప్రపంచం మంచి కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా అమెరికా- చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలను గురించి కూడా జిన్‌పింగ్‌ ప్రస్తావించారు. ఇక ఈ ద్వైపాక్షిక సమావేశానికి ముందు, ఇరువురు నేతలు గౌరవపూర్వక కరచాలనం వేళ జిన్‌పింగ్ ఎదుటే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలికంగా చైనా, అమెరికాల మధ్య నలుగుతున్న ఆర్థిక,వాణిజ్య వివాదాలపై తాము చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ‘చాలా కఠినమైన చర్చల అనుసంధానకర్త(నెగోషియేటర్)’ అని, అయితే అది మంచి విషయం కాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. తాము ఒకరినొకర్ని బాగా అర్థం చేసుకోగలమని, ఇద్దరి నడుమ బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు. చాలా విజయవంతమైన సమావేశం తమ మధ్య జరగబోతోందని పేర్కొన్నారు. 

చైనాతో వాణిజ్య ఒప్పందంపై బూసాన్‌లోనే జిన్‌పింగ్‌తో కలిసి సంతకాలు చేస్తారా? అని విలేకరులు ప్రశ్నించగా, ‘కావొచ్చు’ అని ట్రంప్ బదులిచ్చారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పలు అంశాలపై ఇప్పటికే ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, మిగతా వాటిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మునుపటిలా కలిసికట్టుగా అమెరికా, చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఈ రెండు ప్రపంచ ఆర్థిక శక్తులు భాగస్వాములుగా, మిత్రులుగా మెలగాలని సూచించారు. ఘర్షణ కంటే సహకార భావనే మేలు అని చరిత్ర, ప్రస్తుత కాలమాన పరిస్థితులు చెబుతున్నాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. 

ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక, మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే ట్రంప్ విజన్‌తో కలిసికట్టుగా చైనా వికాసం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.  బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటూ జరిగిన భేటీలో పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఇక భేటీ అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ జిన్‌పింగ్‌తో సమావేశం అద్భుతంగా జరిగిందని తెలిపారు. అనేక అంశాలపై చర్చించినట్లు చెప్పారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ ఫెంటనిల్‌ పేరుతో చైనాపై విధించిన 20శాతం సుంకాలను 10శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ భేటీలో సోయాబీన్‌ కొనుగోళ్లను తిరిగి ప్రారంభించడం, అరుదైన ఖనిజాల ఎగుమతికి సంబంధించిన సమస్యలు పరిష్కారమైనట్లు ట్రంప్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌పై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ గొప్ప నేత అని కొనియాడారు. ఆయనకు 10కి 12 మార్కులు ఇస్తానని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.