మొంథా తుపాను వాయుగుండంగా బలహీనపడింది. తెలంగాణ రాష్ట్రంపై దీని ప్రభావం కొనసాగుతోంది. భద్రాచలానికి 50 కిమీ, ఖమ్మం జిల్లాకు 110 కిమీ దూరంలో వాయుగుండంలో కేంద్రీకృతమైంది. అదే విధంగా ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయవ్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడనుంది. దీని కారణంగా రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి.
సకాలంలో సహాయక చర్యలు అందుబాటులోకి రావడం, రెస్క్యూ టీమ్‌లు ఎక్కడికక్కడ చురుగ్గా కదలడం ఆస్తి, ప్రాణ నష్టాలను చాలావరకు తగ్గించేసింది. అయితే, తుఫాన్ 1.23 లక్షల హెక్టార్ల పంట నష్టం మిగిల్చినట్టు ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసింది. గురువారం విశాఖ, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ఉంటాయని మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు మరో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలానే కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కాల్వలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. అల్లవరం మండలంలోని ఓడరేవుల సమీపంలో ఉన్న పునరావాస శిబిరాన్ని సందర్శించారు. పునరావాస బాధితులకు 3 వేల రూపాయల చొప్పున పరిహారం, నిత్యావసర సరుకులు అందజేశారు. అలానే మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం చొప్పు పంపిణీ చేశారు. దాదపు అరగంట సేపు పునరావాస శిబిరంలోనే గడిపారు. అరగట్ల పాలెం, బెండమూరు లంక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను పరిశీలించారు.
తుపాను వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. 59 వేలకుపైగా హెక్టార్లలో వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని ఇంకా భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోగా, రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు.
పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. దెబ్బతిన్న 2294 కి.మీ. పొడవున ఆర్అండ్బీ రహదారుల వల్ల ఆర్అండ్బీ శాఖకు రూ.1,424 కోట్లు నష్టం కలిగిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని తేల్చిచెప్పారు.

More Stories
కల్తీ నెయ్యిలో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్
గిరిజన ప్రాంతాల్లో ఐదువేల గోవిందుడి ఆలయాలు
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జోక్యం చేసుకోలేం