రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతమైన వేళ ప్రయాణికుల విమానం తయారీకి భారత్ సిద్ధమైంది. రెండు ఇంజిన్లు కలిగిన ఎస్‌జే-100 విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేయనుంది. ఈ మేరకు రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాప్ట్ కార్పోరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. విమానాల విడిభాగాలు, హెలికాప్టర్ల తయారీలో అభివృద్ధిపథంలో సాగుతున్న భారత్ పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ దిశగా ముందడుగు వేసింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎస్‌జే-100 విమానాలను తయారీ కోసం రష్యాకు చెందిన ప్రభుత్వరంగ సంస్థ యునైటెడ్ ఎయిర్‌క్రాప్ట్ కార్పోరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. దేశంలో ప్రయాణికుల విమానం తయారీకి సంబంధించిన మొదటిప్రాజెక్టు ఇదే కానుంది. గతంలో ఏవీఆర్‌వో హెచ్‌ఎస్-748 విమానాలను 1961లో తయారు చేసినప్పటికీ, 1988లోనే ఆ ప్రాజెక్టు ముగిసింది. అయితే వాటిని వాయుసేన కోసం ఉపయోగించారు.
ఉడాన్ పథకం కింద స్వల్ప దూర ప్రయాణాలకు ఎస్‌జే-100 విమానాల తయారీ గేమ్ ఛేంజర్ కానుంది. దేశవ్యాప్తంగా విమానసేవల విస్తరణకు కేంద్రం ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్‌జే-100విమానాల తయారీ దేశీయ విమానయాన రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పేర్కొంది. పౌరవిమానయాన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసే దిశగా అడుగుపడినట్లు తెలిపింది.
ఎస్‌జే-100 విమానాల తయారీ ప్రైవేటు రంగాన్ని బలోపేతం చేయటంతోపాటు విమానయాన రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించింది. వచ్చే పదేళ్లలో దేశీయంగా విమానాల కనెక్టివిటీని పెంచేందుకు ఎస్‌జే-100వంటి విమానాలు 200అవసరం కానుండగా, హిందు మహాసముద్ర ప్రాంతంలో పర్యాటకుల అవసరాలు తీర్చేందుకు ఇలాంటి 350 విమానాల అవసరం ఉంటుందని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెండ్ తెలిపింది.
కాగా, రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌క్రాప్ట్ లిమిటెడ్ ఇప్పటి వరకు ఎస్‌జే -100 విమానాలను 200 వరకు తయారుచేసింది. ప్రపంచవ్యాప్తంగా 16 ఎయిర్‌లైన్స్ వాటిని ఉపయోగిస్తున్నాయి. “హిందూ మహాసముద్ర ప్రాంత పర్యాటక ప్రదేశాలకు సేవలందించేందుకు మరో 350కు పైగా విమానాలు అవసరం. పౌర విమానయాన రంగంలో మనం దేశం ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది” అని హెచ్ఏఎల్ పేర్కొంది.
103 మంది వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ విమానం స్వల్ప దూర ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మాస్కోలో జరిగిన ఒప్పంద కార్యక్రమంలో హెచ్ఏఎల్ సీఎండీ డీకే సునీల్, పీజేఎస్సీ- యూఏసీ డైరెక్టర్ జనరల్ వాది బదేఖా పాల్గొన్నారు. దీని ద్వారా భారత్‌లో ప్రయాణికుల కోసం ఈ ఎస్‌జే-100 విమానాలు తయారు చేసే హక్కులు హెచ్ఏఎస్కు లభిస్తాయి.

More Stories
డ్రగ్స్‌పై బ్రెజిల్ భారీ ఆపరేషన్.. 64 మంది మృతి
టాటా ట్రస్ట్స్ లో మెహ్లి మిస్త్రీ ప్రవేశం నిరోధన
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49 శాతం విదేశీ పెట్టుబడులు?