రజనీకాంత్‌, ధనుష్​లకు బాంబు బెదిరింపులు

రజనీకాంత్‌, ధనుష్​లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులో తమిళ అగ్రనటులు రజనీకాంత్‌, ధనుష్​లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు చెన్నై డీజీపీ కార్యాలయానికి మంగళవారం తెల్లవారుజామున ఈ-మెయిల్ వచ్చింది. అందులో చెన్నై పోయిస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు, కీల్పాక్కంలో ఉన్న టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుతంగై ఇళ్లకు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నైలో బాంబు స్క్వాడ్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

“అక్టోబర్ 27న ఉదయం 8.30 గంటలకు రజనీకాంత్ ఇంటికి మొదటి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అనంతరం తేనాంపేట పోలీసులు బాంబు స్క్వాడ్​ నిర్వీర్య దళంతో రజినీకాంత్ ఇంటికి వెళ్లారు. అయితే, పేలుడు పదార్థాన్ని ఉంచడానికి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని, కాబట్టి అది నకిలీ వార్త అయి ఉండొచ్చని రజినీకాంత్​ భద్రతా సిబ్బంది బాంబ్​ స్వ్కాడ్​కి చెప్పారు” అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. 

“మళ్లీ అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు రెండో బెదిరింపు మెయిల్ వచ్చినా రజినీకాంత్​ భద్రతా సిబ్బంది తనిఖీని నిరాకరించారు. మరోవైపు నటుడు ధనుష్‌కు కూడా అదే రోజు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందని, ఆయన కూడా తనిఖీ చేయడానికి తిరస్కరించారు” అని వివరించారు. ఇదిలా ఉండగా ఈమెయిల్స్‌లో పేర్కొన్న ఇతరుల ఇళ్లను కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్​ దళం తనిఖీ చేసి అవి నకిలీవని తేల్చారు.

తమిళ ప్రముఖులకు బాంబు బెదిరింపులుఇదే తరహాలో ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రముఖులకు ఇలాంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సినీ నటి త్రిష నివాసాలతో పాటు భాజపా ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు అక్టోబర్‌ 3న బాంబు బెదిరింపులు వచ్చాయి.

అదే విధంగా చెన్నైలోని నీలాంగరైలో ఉన్న ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ అధ్యక్షుడు విజయ్​ నివాసానికి కూడా కొన్ని రోజుల క్రితం బాంబు బెదిరింపులు వచ్చాయి. విజయ్ నివాసంలో బాంబులు పేలబోతున్నాయని పోలీసు కంట్రోల్ రూమ్‌కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు.   అయితే ఆ కాల్​ చేసిన శబిక్ అనే 37 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 14న, టి నగర్‌లోని సంగీత దర్శకుడు ఇళయరాజా స్టూడియోను లక్ష్యంగా చేసుకుని దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.  ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో సహా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఈ నకిలీ బాంబు బెదిరింపులకు గురయ్యారు.