జూబ్లీహిల్స్ లో పాదయాత్రలతో బిజెపి ఉధృత ప్రచారం

జూబ్లీహిల్స్ లో పాదయాత్రలతో బిజెపి ఉధృత ప్రచారం

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం నియోజకవర్గంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ‘మాస్ కాంపెయిన్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు ఘనంగా నిర్వహించారు.

ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్‌లో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ బోరబండ డివిజన్ రాజ్ నగర్‌లో, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు రహమత్ నగర్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నేతలు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విధానాలపై మండిపడ్డారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు అవకాశం కల్పించారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్ జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు.

గడపగడపకూ తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరించారు. ఆరు గ్యారంటీలు సహా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌తో ఎంఐఎం లోపాయికారీ ఒప్పందంపై మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో కలిసిపోతూ హైదరాబాద్ అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. 

కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఎదురయ్యే సమస్యలను వివరించారు. రౌడీషీటర్లను ప్రోత్సహిస్తూ, కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు ఈ రెండు పార్టీలు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల పోటీలో లేకుండానే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పెత్తనం అంతా ఎంఐఎం చేస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గుండాయిజం, కబ్జాలు, రౌడీషీటర్ల నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారంతో జూబ్లిహిల్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్డు, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం.. అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు వివరించారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు ఆరా తీస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నేతలు ప్రచారం చేశారు. బీజేపీకి ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

గతంలో బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ జూబ్లీహిల్స్‌లో రోడ్లు దారుణంగా తయారయ్యాయని దుయ్యబట్టారు. ఓట్లు వేయించుకుని మౌలిక వసతులను కల్పించేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయలేదని, ప్రజలను పట్టించుకోలేదని రామచంద్రరావు ఆరోపించారు.  వర్షాలు కురిస్తే రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. డ్రైనేజీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తోందని, సెప్టిక్ ట్యాంకులు ఓవర్‌ఫ్లో అయి రోడ్లపై పారుతున్నాయని చెప్పారు. దీంతో పిల్లలు జబ్బులతో బాధపడుతున్నట్లు ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని ఆయన తెలిపారు.