దీనితో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నెల 18న ఈ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా 10 మందికి మించి ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆర్ఎస్ఎస్ సమావేశాలు నిర్వహించడం చట్టవిరుద్ధం అని ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల ఆవరణలను వినియోగించుకోవాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది. అయితే, రాష్ట్రంలో ఆరెస్సెస్ కార్యకలాపాలను నిషేధించే ఉద్దేశంతోనే సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హుబ్బళ్లిలోని పునస్థేన్ సేవా సంస్థ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను జస్టిస్ ఎం.నాగప్రసన్న సింగిల్ జడ్జ్ బెంచ్ విచారణ చేసింది.
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అశోక్ హరనహళ్లి తన వాదనలు వినిపిస్తూ, “ప్రభుత్వ ఉత్తర్వులు, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుపై పరిమితులు విధిస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పార్కులో పార్టీ మీటింగ్ జరిగినా అది చట్టవిరుద్ధమైన సమావేశం అయిపోతుంది. రాష్ట్రంలో పోలీసు చట్టం అమలులో ఉండగా, ప్రభుత్వం ఇలాంటి పరిపాలనా ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? “అని వాదించారు.
ఈ వాదనలు విన్న ధర్మాసనం, “ఈ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం ఇంకేమైనా సాధించాలని అనుకుంటుందా?” అని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అయితే దీనికి సరైన సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు- కర్ణాటక ప్రభుత్వం, హోం శాఖ, డీజీపీ, హుబ్బలి పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.
“రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(బి) కింద కల్పించిన ప్రాథమిక హక్కులను కర్ణాటక ప్రభుత్వం హరించిందని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో అనుమతి లేకుండా 10 మంది గుమిగూడితే అది నేరమని ఉంది. అంటే రోడ్లు, పార్కులు, మైదానాలు, సరస్సులు మొదలైన వాటిలోకి కూడా ప్రవేశించకుండా పరిమితులు విధించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా తీసివేయలేం. అందువల్ల ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే విధిస్తున్నాం. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేస్తున్నాం” అని హైకోర్టు పేర్కొంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించాలని కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు భావించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత, మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై రాష్ట్రంలో నిషేధం విధించాలంటూ సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. దీనితో సిద్ధరామయ్య సర్కార్ ఈ నెల 18న సదరు ఉత్తర్వు చేసింది.
కర్ణాటకలో రాజకీయ రగడకు దారితీసింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించడమే లక్ష్యంగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు, తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

More Stories
భారతీయ నేలల్లో తీవ్రంగా లోపించిన పోషకాలు
బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
బీహార్ ఎన్నికల ప్రచారంలో కనిపించని రాహుల్ గాంధీ!