మావోయిస్టు కీలక నేత పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నబండిప్రకాశ్ తో కలిసి డిజిపి శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 1980 లో పుల్లూరి ప్రసాద్ రావు కిషన్ జీకి అనుచరుడిగా మారారని, 1981 లో పుల్లూరి ప్రసాద్ రావు పీపుల్స్ వార్ లో చేరారని తెలియజేశారు.1983 లో పుల్లూరి ప్రసాద్ కమాండర్ అయ్యారని, 1992 లో ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీగా పని చేశారని డిజిపి పేర్కొన్నారు.
బండి ప్రకాష్ పై ఉన్న రూ. 20 లక్షల రివార్డు ఆయనకే ఇస్తామని, పుల్లూరి ప్రసాద్ రావు పై రూ.25 లక్షల రివార్డు ఆయనకు ఇస్తామని హామి ఇచ్చారు. చంద్రన్న 15 ఏళ్ల కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ప్రకాష్, మావోయిస్టు పార్టీలో 45 సంవత్సరాలు వివిధ స్థాయిల్లో పని చేశారు. అలాగే నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రభాత్ అనే పేరుతో ప్రెస్టమ్ ఇన్ఛార్జిగా కూడా బండి ప్రకాశ్ బాధ్యతలు నిర్వర్తించారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఆయన, మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు.
అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమాలకు ఆకర్షితుడై 1980లో సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988లో బెల్లంపల్లిలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు. ఈ సమయంలోనే ఆయన పేరు ఒక సంచలనమైంది. ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు.. నాటి పీపుల్స్‌వార్ ముఖ్య నేతలైన నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి సబ్ జైలు గోడలను బద్దలుకొట్టి, తుపాకులతో సహా చాకచక్యంగా తప్పించుకున్నారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనం సృష్టించింది.
అనంతరం.. 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాష్ 2004లో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత, ఆయన మళ్లీ అడవి బాట పట్టారు. గత 20 ఏళ్లుగా బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన 64 మంది మావోయిస్టులు యాక్టివ్ గా ఉన్నారని డిజిపి తెలిపారు. 64 మందిలో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని, మరో 10 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని అన్నారు. 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో ఉన్నారని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.

More Stories
బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్