ఏపీలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ

ఏపీలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్‌ తయారీ పరిశ్రమ
ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంపోనెంట్‌ స్కీం కింద దేశంలోని మూడు రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడితో ఏడు ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ ఆమోద ముద్ర వేసిందని ఆ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ఏడు ప్రాజెక్టుల్లో మొత్తం రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, 5,100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. 
 
ఇందులో సైర్మా స్ట్రాటెజిక్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.765 కోట్ల పెట్టుబడితో మల్టీ లేయర్‌ ప్రింటెండ్‌ సర్క్యూట్‌ బోర్డు (పిసిబి) తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఇందులో మొత్తం రూ.6,933 కోట్ల విలువైన ఉత్పత్తులు తయారవుతాయి. 955 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
 
తమిళనాడులో కేనెస్‌ సర్క్యూట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నాలుగు యూనిట్లు, అస్సెంట్‌ సర్క్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మరో యూనిట్‌ కలిపి మొత్తం రూ.4,271 కోట్ల పెట్టుబడితో 5 యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ అనే మరో సంస్థ రూ.496 కోట్లతో మధ్యప్రదేశ్‌లో ఒక యూనిట్‌ నెలకొల్పనుంది. ఈ యూనిట్ల ద్వారా దేశీయంగా కాపర్‌క్లాడ్‌ లామినేట్‌ 100%, పీసీబీ (పిసిబి)కి ఉన్న డిమాండ్‌లో 20%, కెమెరా మాడ్యూల్స్‌లో 15% అందుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ప్రకటించారు. 
 
ఈ పథకం కింద దేశంలో యూనిట్ల ఏర్పాటు కోసం మొత్తం 249 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. రూ.1.15 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.10.34 లక్షల కోట్ల ఉత్పత్తులు తయారు చేయడానికి, 1.42 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి వీరు ముందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఇందులో ప్రస్తుతం రూ.5,500 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.