భారతదేశపు అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది. 2025 ప్రపంచ బ్యాంకు/ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ అవార్డు ప్రదానోత్సవంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) న్యూయార్క్‌లోని గ్లోబల్ ఫైనాన్స్ నుండి రెండు ప్రతిష్టాత్మక ప్రశంసలను అందుకుంది: అవి, ప్రపంచంలోని ఉత్తమ వినియోగదారుల బ్యాంకు 2025, భారతదేశంలో ఉత్తమ బ్యాంకు 2025.
ఈ గుర్తింపు ద్వారా ఎస్‌బీఐ ఆవిష్కరణ, ఆర్థిక చేరిక, కస్టమర్ సర్వీస్ వంటి అంశాల్లో తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించింది. ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపినట్లుగా, ఈ బహుమతులు భారతదేశం వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితుల్లో సేవలను విస్తరించడం, టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంలో సంస్థ చేసిన కృషికి ప్రతిఫలమని పేర్కొంది.
ఎస్‌బీఐ చైర్మన్ సీ.ఎస్. సెట్‌టి మాట్లాడుతూ రోజుకు సగటున 65,000 కొత్త కస్టమర్లను జోడించేందుకు టెక్నాలజీ, డిజిటలైజేషన్‌లో భారీ పెట్టుబడులు పెట్టుతున్నామని తెలిపారు. ‘డిజిటల్ ఫస్ట్, కన్స్యూమర్ ఫస్ట్’ ధోరణితో ఎస్‌బీఐ తన మొబైల్ యాప్ ద్వారా 100 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోందని, రోజువారీగా 10 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారని తెలిపారు.
“ ఎస్‌బీఐ రోజువారీ నిబద్ధతను గ్లోబల్ ఫైనాన్స్ గుర్తించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. 520 మిలియన్ల కస్టమర్లకు సేవ చేయడానికి, రోజుకు 65,000 మంది కొత్త కస్టమర్లను జోడించడానికి సాంకేతికత, డిజిటలైజేషన్‌లో గణనీయమైన పెట్టుబడి అవసరం. ‘డిజిటల్ ఫస్ట్, కన్స్యూమర్ ఫస్ట్’ బ్యాంక్‌గా, మా ఫ్లాగ్‌షిప్ మొబైల్ అప్లికేషన్ రోజువారీ 10 మిలియన్ల యాక్టివ్ యూజర్లతో. 100 మిలియన్లకుపైగా కస్టమర్లకు సేవలు అందిస్తుంది” అని వివరించారు.
బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ. 8.5 లక్షల కోట్లు దాటింది. జూన్ 2025 నాటికి, బ్యాంకు రూ. 54.73 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ బేస్‌ను కలిగి ఉంది. సిఎఎస్ఎ నిష్పత్తి 39.36 శాతం, రూ. 42.54 లక్షల కోట్లకు పైగా అడ్వాన్సులను కలిగి ఉంది. న్యూస్ వీక్ ద్వారా ప్రపంచంలోనే 4వ అత్యంత విశ్వసనీయ బ్యాంకుగా ర్యాంక్ పొందిన ఎస్‌బీఐ, గృహ రుణాలు, ఆటో రుణాలలో వరుసగా 27.7 శాతం, 19.03 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స లో పోస్ట్ చేస్తూ — “ఎస్‌బీఐ కుటుంబానికి ఈ అర్హతగల గ్లోబల్ అవార్డులు దక్కడం గర్వకారణం. ఆర్థిక చేరిక, సమాజంలోని ప్రతి వర్గానికి బ్యాంకింగ్ సేవలను చేరవేయడంలో ఎస్‌బీఐ చేసిన కృషి భారత వృద్ధి కథలో కీలకమైన భాగం,” అని పేర్కొన్నారు.

More Stories
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పే కమిషన్‌కు ఆమోదం
ఏపీలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ
ఐదేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు