బంగ్లా మ్యాప్ లో ఈశాన్య భారత్… విషం కక్కుతున్న యూనస్

బంగ్లా మ్యాప్ లో ఈశాన్య భారత్… విషం కక్కుతున్న యూనస్
* యూనుస్ పాక్, చైనాలతో దోస్తీ

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ మరోసారి వివాదాన్ని రాచేశారు. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్‌ను పాక్ సైనిక ఉన్నతాధికారికి ఆయన బహూకరించారు. దీంతో ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు బంగ్లా సర్కారు వంతపాడుతోందా? అనే చర్చ మొదలైంది. వాస్తవానికి 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచే ఈశాన్య భారత రాష్ట్రాలపై మహ్మద్ యూనుస్ విషం కక్కుతున్నారు. ఇక ఇదే సమయంలో భారత్ విరోధులైన పాకిస్థాన్, చైనాలతో అంటకాగుతున్నారు.

1971 సంవత్సరంలో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని సాధించింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌కు సాయం చేసిన ఏకైక దేశం భారత్ మాత్రమే. అందుకే భారత్ – బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ దగ్గరవుతోంది. ఈక్రమంలోనే గత వారం చివర్లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్‌పర్సన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్‌లో పర్యటించారు. 

ఢాకా నగరం వేదికగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్‌తో ఆయన భేటీ అయ్యారు. ఇరుదేశాల సైనిక సంబంధాలపై వారు చర్చించారు. ఈసందర్భంగా జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాకు బంగ్లాదేశ్ మ్యాప్‌తో పాటు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకాన్ని యూనుస్ బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూనుస్ ట్వీట్ చేశారు. 

ఆ ఫొటోలను తరచి చూస్తే, బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారతదేశంలోని అసోం సహా ఈశాన్య రాష్ట్రాలన్నీ ఉన్నాయి. దీన్ని చూసి భారతీయ నెటిజన్లు ఫైర్ అయ్యారు. బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌లను ఎందుకు ప్రింట్ చేస్తున్నారంటూ యూనుస్‌కు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించకపోవడం గమనార్హం. 

‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పుస్తకం విషయానికొస్తే, 2024 సంవత్సరం జులైలో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమంపై ఈ బుక్‌ను రాశారు. ఈ ఉద్యమం వెనుక పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉందని అంటారు. నాడు విద్యార్థులు జరిపిన హింసాత్మక నిరసనల వల్ల, భారత్‌ను సమర్ధించే షేక్ హసీనా సర్కారు కూలిపోయింది. ఫలితంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గ్యాప్ పెరిగింది.

ఈశాన్య భారత రాష్ట్రాలపై మహ్మద్ యూనుస్ విషం కక్కడం ఇదే తొలిసారేం కాదు. గతంలో పలు అంతర్జాతీయ వేదికలపైనా దీని గురించి ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా చైనాలో యూనుస్ పర్యటించారు. అక్కడ చేసిన ప్రసంగంలో ఈశాన్య భారత రాష్ట్రాలను ఆయన ప్రస్తావించారు. 

“ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాల చుట్టూ భూమే ఉంది. అందువల్ల వాటికి సముద్ర మార్గంలో భద్రత కల్పించగల ఏకైక దేశం బంగ్లాదేశ్ మాత్రమే. ఇదొక పెద్ద అవకాశం. దీన్ని అదునుగా చేసుకొని మా ప్రాంతంలోకి చైనా తన ప్రభావాన్ని విస్తరించాలి. తద్వారా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి” అని యూనుస్ ఆనాడు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మే నెలలో జమ్మూకశ్మీరులోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన వెంటనే, పాక్‌పై భారత్ దాడి చేస్తుందనే వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా మహ్మద్ యూనుస్ సన్నిహితుడు, బంగ్లాదేశ్ ఆర్మీ రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌పై భారత్ దాడి చేస్తే, భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవడానికి చైనాకు బంగ్లాదేశ్ సహకరించాలని ఆయన కామెంట్ చేశారు.

2024లో యూనుస్‌ మరో సన్నిహితుడు నహీదుల్ ఇస్లాం బంగ్లాదేశ్ తప్పుడు మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మ్యాప్‌‌లో పశ్చిమ బెంగాల్, త్రిపుర, అసోంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ కలిపి ‘గ్రేటర్ బంగ్లాదేశ్’ను ఏర్పాటు చేయాలని నహీదుల్ ఇస్లాం డిమాండ్ చేయడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సోషల్ మీడియా పోస్ట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు దీన్ని డిలీట్ చేయాల్సి వచ్చింది.

ఈవిధంగా భారత్‌ను రెచ్చగొట్టేలా తన సన్నిహితులు సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నా, వ్యాఖ్యలు చేస్తున్నా యూనుస్ స్పందించడం లేదు. అవన్నీ పట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు భారత్ విరోధులైన చైనా, పాకిస్థాన్‌లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.

‘చికెన్స్ నెక్ కారిడార్’ భారత్‌కు చాలా ముఖ్యమైంది. ఇది పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం సరిహద్దుల్లో ఉంది. ‘చికెన్స్ నెక్ కారిడార్’ మీదుగానే ఈశాన్య రాష్ట్రాలతో భారత్ కనెక్ట్ అవుతుంది. ‘చికెన్స్ నెక్ కారిడార్’ పక్కనే బంగ్లాదేశ్ ఉంటుంది. ఈ కారిడార్‌ను తెంచి, ఈశాన్య రాష్ట్రాలకు భారత్‌ను దూరం చేయాలనే కోణంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనుస్ సన్నిహితులు ఎన్నో వ్యాఖ్యలు చేశారు.

 వీటిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చికెన్స్ నెక్ కారిడార్’ అనేది బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్‌లతో కూడిన ‘బిమ్‌స్టెక్‌’ కూటమిలోని దేశాలకు కీలకమైన కనెక్టివిటీ హబ్‌ అని తెలిపారు. బంగ్లాదేశ్ వివాదాస్పద వైఖరి నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. నేపాల్, భూటాన్, మయన్మార్‌లకు భారత్ మీదుగా బంగ్లాదేశ్ వస్తువులను చేరవేసే ట్రాన్స్‌షిప్‌మెంట్ ఒప్పందాన్ని రద్దు చేసింది.