12 రాష్ట్రాల్లో నేటి నుండే రెండో దశ ఎస్ఐఆర్

12 రాష్ట్రాల్లో నేటి నుండే రెండో దశ ఎస్ఐఆర్
* అసోంలో ప్రత్యేక ఎస్‌ఐఆర్‌

దేశంలో రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ను మంగళవారం నుంచి చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత ఎస్ఐఆర్ చేపడతామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్ కుమార్‌ వెల్లడించారు. మంగళవారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, బంగాల్‌, రాజస్థాన్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, పుదుచ్చేరి, అండమాన్‌, లక్షద్వీప్‌లో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

డిసెంబరు 9న ముసాయిదా ఎస్ఐఆర్ జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వివరించారు. దేశంలో ఇప్పటివరకు 8సార్లు సమగ్ర ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్న ఆయన, గత 20 ఎళ్ల నుంచి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా జరగలేదని గుర్తుచేశారు.

కాగా, అసోంలో ప్రత్యేక ఎస్‌ఐఆర్‌ నిర్వహిస్తామని జ్ఞానేష్‌కుమార్‌ ప్రకటించారు. పౌరసత్వ చట్టంలోని ప్రత్యేక నిబంధన అస్సోంకు వర్తిస్తుందని తెలిపారు. పౌరసత్వ చట్టం ప్రకారం అసోంలో పౌరసత్వం కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పౌరసత్వాన్ని తనిఖీ చేసే ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. జూన్‌ 24 నాటి ఎస్‌ఐఆర్‌ ఆదేశం మొత్తం దేశానికి సంబంధించినదని, అటువంటి పరిస్థితుల్లో ఇది అసోంకు వర్తించదని తెలిపారు. అస్సోంకు ప్రత్యేక సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని, ప్రత్యేక ఎస్‌ఐఆర్‌ తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ఆర్ ఆవశ్యకతను వివరిస్తూ “ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌కు కొందరు సహాయకులు ఉంటారు. జాబితా ప్రకటించాక ప్రతి ఒక్కరికీ అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఓటరుకు ఇన్యుమరేషన్‌ ఫామ్ అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా 4 రకాల కారణాలతో ఓటర్ల తొలగింపు ఉంటుంది. అర్హులైన ఓటర్లే జాబితాలో ఉంటారు. అనర్హులను తొలగిస్తాం” అని స్పష్టం చేశారు. 

“6 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ నేతలతో భేటీ ఏర్పాటు చేస్తాం. ఒక్కో అధికారి రోజుకు 50 ఇన్యుమరేషన్‌ ఫామ్‌లు పరిశీలిస్తారు. ఇన్యుమరేషన్‌ ఫామ్‌లు పరిశీలించాక ఓటరు జాబితా డ్రాఫ్ట్ ప్రకటిస్తాం. ఓట్లు తొలగించిన వారి పేర్లను స్థానిక కార్యాలయాల్లో ప్రదర్శిస్తాం” అని వివరించారు.

ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్న 12 రాష్ట్రాల్లో 51కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, మొత్తంగా 5.33లక్షల బూత్‌ స్థాయి అధికారులు (బిఎల్‌ఓ)లను పనిచేయనున్నారని ప్రకటించారు. వీరితో పాటు రాజకీయ పార్టీలు 7లక్షల మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బిఎల్‌ఎ) నియమించనున్నాయని, బిఎల్‌ఓ, బిఎల్‌ఎలకు మంగళవారం నుండి నవంబర్‌ 3 వరకు ముద్రణ, శిక్షణ ప్రారంభమవుతుందని, ఆతర్వాత నవంబర్‌ 4 నుండి డిసెంబర్‌ 4 వరకు ఇంటింటి గణన ఉంటుందని తెలిపారు.