జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రౌడీ షీటర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందేమోనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అనుమానం వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోయిందని, జూబ్లీహిల్స్లో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పక్కాగా ఈ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రాంచందర్ రావు సోమవారం విలేకరుల సమావేశంలో ఎద్దేవా చేశారు.
ఆయన చెప్పిన ఆరు గ్యారంటీలు ఇవిః జంట నగరాల్లోని రౌడీ షీటర్లపై కేసుల ఎత్తివేత, బెదిరింపులు, దౌర్జనాల్పై కేసు నమోదు చేయకపోవడం, వయసు పైబడిన రౌడీ షీటర్లకు నెలకు యాభై వేల రూపాయల పెన్షన్, రౌడీ షీటర్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, భూకబ్జాలు, సెటిల్మెంటర్లకు ప్రత్యేక లైసెన్స్ జారీ ఆరో గ్యారంటీ అని ఆయన తెలిపారు.
తెలంగాణలో ఎటువంటి రాజ్యం కావాలన్నది జూబ్లీహిల్స్ ఓటర్లు నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణలో గన్ కల్చర్, హింస పెరుగుతుంటే, మరోవైపు కాంగ్రెస్ మజ్లీస్ పార్టీతో కలిసి శాంతి-భద్రతలను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శాంతి-భద్రతల పరిస్థితులపై తాను ఇదివరకే డిజిపికి లేఖ రాశానని ఆయన గుర్తు చేశారు.
చాదర్ఘాట్ ఘటన జరగక ముందే తాను ప్రభుత్వాన్ని హెచ్చరించానని పేర్కొంటూ ప్రభుత్వ నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులను, ఉద్యోగులను, విద్యార్థులను, సామాన్యులను ఆదుకోవడం లేదని, చివరకు పోలీసులకూ రక్షణ లేకుండా పోయిందని బిజెపి నేత దయ్యబట్టారు. అమర వీరుల పట్ల కూడా అన్యాయం జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదని రాంచందర్ రావు విమర్శించారు. బిఆర్ఎస్ పూర్తిగా జీరో అయ్యిందని, కారు ఫంక్షర్ అయ్యిందని పేర్కొంటూ లోగడ మజ్లీస్ గ్యారేజీలో ఉండే కారు ఇప్పుడు బయటకు వచ్చినా ఫంక్షర్ అయ్యిందని, ఆ కారుకు స్టీరింగ్ లేదు, టైర్లు ఊడిపోయాయి, డ్రైవరూ లేరని ఆయన ధ్వజమెత్తారు. అటువంటి కారులో నుంచి వచ్చిన వారు ఏమి మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

More Stories
మావోయిస్టు తెలంగాణ నేత బండి ప్రకాష్ లొంగుబాటు
బీహార్ ఎన్నికల ప్రచారం నుండి రేవంత్ తొలగింపు!
జర్నలిస్టులకు విరాహత్ అలీ క్షమాపణ చెప్పాలి