త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ పేరు ప్రతిపాదన

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ పేరు ప్రతిపాదన

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ సూర్య‌కాంత్  పేరును ప్ర‌స్తుత సీజేఐ బీఆర్ గ‌వాయ్ ప్ర‌తిపాదించారు. త‌న ప్ర‌తిపాదిత లేఖ‌ను ఆయ‌న కేంద్ర న్యాయ‌శాఖ‌కు ఇవాళ పంపారు. న‌వంబ‌ర్ 23వ తేదీన బీఆర్ గ‌వాయ్ రిటైర్‌కానున్నారు. సుప్రీంకోర్టులో ప్ర‌స్తుతం సూర్య‌కాంత్ సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు. 2019, మే 24వ తేదీన సుప్రీంకోర్టు జ‌డ్జీగా జ‌స్టిస్ సూర్య‌కాంత్‌కు పదోన్న‌త ల‌భించింది. 

2027, ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ వ‌ర‌కు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ఆయ‌న కొన‌సాగ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ సుమారు 14 నెల‌ల పాటు సేవ‌లు అందించ‌నున్నారు. హర్యానాలోని హిసార్‌లో 1962, ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన జ‌స్టిస్ సూర్య‌కాంత్ ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించారు.  1981లో ప్ర‌భుత్వ పీజీ కాలేజీ నుంచి ఆయ‌న ప‌ట్టాపొందారు.

1984లో రోహ‌త‌క్‌లోని మ‌హ‌ర్షి ద‌యానంద్ యూనివ‌ర్సిటీ నుంచి న్యాయ‌విద్య‌లో బ్యాచ‌ల‌ర్స్ డిగ్రీ పొందారు. 1984 నుంచి హిసార్ జిల్లా కోర్టులో ఆయ‌న ప్రాక్టీసు మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత 1985లో ఆయ‌న త‌న ప్రాక్టీస్‌ను పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టుకు మార్చుకున్నారు. 2001 మార్చిలో ఆయ‌న సీనియ‌ర్ న్యాయ‌వాదిగా నియ‌మితుల‌య్యారు. హ‌ర్యానా అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌గా చేశారు. ఆ త‌ర్వాత పంజాబ్‌, హ‌ర్యానా హైకోర్టుకు ప‌ర్మినెంట్ జ‌డ్జీగా చేశారు. 2018, అక్టోబ‌ర్ 5వ తేదీన ఆయ‌న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ హైకోర్టుకు చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ సూర్య‌కాంత్ నియ‌మితుడ‌య్యారు.