రష్యా అమ్ములపొదిలో అపరిమిత పరిధిలో ‘బూరెవెస్ట్‌నిక్‌’

రష్యా అమ్ములపొదిలో అపరిమిత పరిధిలో ‘బూరెవెస్ట్‌నిక్‌’
రష్యా అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అణుశక్తితో నడిచే ‘బూరెవెస్ట్‌నిక్‌’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు. దీనితో భూమ్మీద ఇప్పటివరకూ ఏ దేశం తయారుచేయని అతిశక్తివంతమైన క్షిపణిని రష్యా విజయవంతంగా పరీక్షించిన్నట్లయింది.
 
 ఎంత దూరమైనా, ఎన్ని రోజులైనా ప్రయాణించి లక్ష్యంపై దాడి చేసే సామర్థ్యం ఉన్న “బురెవెస్ట్‌నిక్” క్రూయిజ్ క్షిపణి సిద్ధమైందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఏ రక్షణ వ్యవస్థా దీన్ని ఎదుర్కోలేదని తెలుస్తోంది. శత్రుదాడుల నుంచి తమ దేశాన్ని రక్షించేందుకు అమెరికా నిర్మించనున్న గోల్డెన్ డోమ్‌ కూడా రష్యా క్షిపణిని అడ్డుకోలేదనే అంచనాలు వెలువడుతున్నాయి. కాగా రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పుతిన్‌ ఆ విన్యాసాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఇతర సైనిక కమాండర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పరీక్షల సమయంలో ‘బూరెవెస్ట్‌నిక్‌’ క్రూయిజ్ క్షిపణి 15 గంటలపాటు గాల్లోనే ఉందని, 14 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని సైనికాధికారులు ఆయనకు తెలిపారు.

ఈ క్షిపణిని అక్టోబర్ 21నే పరీక్షించినట్టు రష్యా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకుని దాడి చేసే సామర్థ్యం దీని సొంతమని తెలుస్తోంది. రష్యా తయారు చేసిన బురెవెస్ట్నిక్‌ క్షిపణి న్యూక్లియర్‌ టర్బోజెట్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ప్రయోగించిన తర్వాత ఇంధనంతో నిమిత్తం లేకుండా ఎంతదూరమైనా, ఎన్ని రోజులైనా నిరంతరాయంగా ప్రయాణించే శక్తి ఉంటుంది. 

గంటకు 850 నుంచి 1300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యం దీని సొంతం. వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా ఎలాగైనా సరే లక్ష్యాలపై దాడి చేసే సత్తా ఉంటుంది. దాడి చేసే క్రమంలో ప్రయోగించిన తర్వాత మధ్యలోనే ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా దాడిచేసే మార్గాన్ని మళ్లించేందుకు, కొత్త లక్ష్యాలను ఎంచుకునేందుకు ఆస్కారం ఉంది.

అంతకుముందు సైనిక ఉన్నతాధికారులతో పుతిన్‌ భేటీ అయ్యారు. రష్యా సాయుధ బలగాల చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ నేతృత్వంలోని కమాండర్లతో సంభాషించారు. సుమారు 10 వేల మందికిపైగా ఉక్రెయిన్‌ సైనికులను తాము చుట్టుముట్టామని గెరాసిమోవ్‌ తెలిపారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్‌ సాయుధ దళాల బృందాన్ని తాము అడ్డుకున్నామని చెప్పారు.