కంబోడియా-థాయ్‌ శాంతి ఒప్పందంతో అరుదైన ఖనిజాలపై ట్రంప్!

కంబోడియా-థాయ్‌ శాంతి ఒప్పందంతో అరుదైన ఖనిజాలపై ట్రంప్!

ఆదివారం మలేషియాలోని కౌలలంపూర్‌ వేదికగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో కంబోడియా – థాయ్‌లాండ్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక ఇదే సమయంలో ఇంత కంటే కీలకమైన ‘అరుదైన ఖనిజ నిక్షేపాల’ (రేర్ ఎర్త్ మినరల్స్) సహకారం కోసం కంబోడియా, థాయ్‌లాండ్, మలేషియాలతో ట్రంప్ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. తద్వారా ఈ విభాగంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాల్‌ను ఎదుర్కొనే దిశగా అమెరికా పావులు కదిపింది. 

అరుదైన ఖనిజ వనరుల కోసం ‘ఆసియాన్’ దేశాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న భారత్‌నూ ఖంగు తినిపించింది. మలేషియాలో జరుగుతున్న ‘ఆసియాన్’ దేశాల . ప్రసదస్సుకు కేంద్ర బిందువుగా ట్రంప్ ఉన్నారు. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు డుమ్మా కొట్టిన ట్రంప్ ఆసియాన్ సదస్సుకు హాజరవడం వెనుక ‘రేర్ ఎర్త్ మినరల్స్’ అజెండాయే ఉందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు అంటున్నారు.

కంబోడియా, థాయ్‌లాండ్, మలేషియాలలో అపారమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. వాటిని అమెరికా కంపెనీలకు విక్రయించేందుకు ఉద్దేశించిన ఒప్పందాలను ఆ మూడు దేశాలతో ట్రంప్ కుదుర్చుకున్నారు. ఈ అంశం అమెరికాలోని ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు, సెమీ కండక్టర్ల కంపెనీలు, రక్షణ రంగ కంపెనీలకు విశేషమైన ప్రయోజనాలు కలిగిస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, రక్షణ రంగ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను తయారు చేయాలంటే అరుదైన ఖనిజ నిక్షేపాలు కావాల్సిందేే. ఈ విభాగంలో ప్రస్తుతం ప్రపంచ రారాజుగా చైనా వెలుగొందుతోంది. ఏటా ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజ నిక్షేపాల్లో 70 శాతం చైనాలోనే రిఫైన్ (శుద్ధి) అవుతున్నాయి. గాలియం, జెర్మేనియం లాంటి ముఖ్యమైన లోహాలను విదేశాలకు ఎగుమతి చేయడంపై కఠిన నిబంధనలను చైనా ఇటీవలే అమల్లోకి తెచ్చింది. 

దీంతో అమెరికా కంపెనీలు భయాందోళనలకు గురయ్యాయి. ఓ వైపు చైనాపై ఒత్తిడిని పెంచుతూనే, మరోవైపు రేర్ ఎర్త్ మినరల్స్ లభించే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్‌‌కు మొరపెట్టుకున్నాయి. ఈ కారణం వల్లే రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా లభించే ఆసియాన్ దేశాలపై అమెరికా కన్నుపడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

‘ఆసియాన్’ కూటమి దేశాల్లో వియత్నాం నుంచి థాయ్‌లాండ్, లావోస్, మలేషియా దాకా ఖనిజ వనరుల బెల్ట్ విస్తరించి ఉంది. ఈ బెల్ట్‌లో శాంతి వల్ల ఆ దేశాల కంటే అమెరికా కంపెనీలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ట్రంప్ ప్రత్యేక చొరవ చూపి మరీ కంబోడియా – థాయ్‌లాండ్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. 

 
ఈ అంశాన్ని ఆసరాగా చేసుకొని ఆసియాన్ దేశాలతో అమెరికా బంధాన్ని బలోపేతం చేసే యత్నాలు చేస్తున్నారు. అమెరికాతో దోస్తీ చేస్తే అంతర్జాతీయ ఇమేజ్ పెరుగుతుందని, విదేశీ పెట్టుబడులు లభిస్తాయని ఆసియాన్ దేశాల ప్రభుత్వాధినేతలతో ట్రంప్ చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో ఆయా దేశాల్లోని రేర్ ఎర్త్ మినరల్స్‌ను అమెరికా కంపెనీలకు విక్రయించాలని కోరుతున్నారు.