తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజకీయ విరాళాల రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి అందిన విరాళాలు గతంతో పోలిస్తే ఏకంగా 97.40 శాతం పడిపోయాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.15,09,08,141 (రూ. 15.09 కోట్లు) మాత్రమే విరాళాలుగా అందాయి. ఈ నిధులలో ఎక్కువ భాగం ట్రస్టుల ద్వారానే సమకూరాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ.10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రూ.5 కోట్లు విరాళాలుగా వచ్చాయి. వ్యక్తిగత విరాళాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఎస్.రాజేందర్‌రెడ్డి రూ.8.79 లక్షలు, మహమ్మద్ అజార్ రూ.29 వేలు మాత్రమే పార్టీకి అందించారు.
విరాళాల రూపంలో వచ్చిన ఈ స్వల్ప మొత్తం, గత రెండేళ్ల ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే పార్టీకి తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీఆర్‌ఎస్‌కు మొత్తం రూ.580.52 కోట్లు విరాళాలుగా వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే రూ.495.52 కోట్లు దక్కాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి అదనంగా రూ.85 కోట్లు వచ్చాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో పార్టీ అత్యధికంగా రూ.683.06 కోట్ల విరాళాలు పొందింది. అందులో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రూ.529 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి రూ.90 కోట్లు, వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి రూ.64.03 కోట్లు వచ్చాయి. ప్రధానంగా ఎలక్టోరల్ బాండ్ల వ్యవస్థ రద్దు కావడం, అలాగే 2023 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అధికారం కోల్పోవడం వంటి కారణాల వల్లనే విరాళాలు ఇంత భారీగా పడిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీ నాయకత్వం, కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ గణాంకాలు బీఆర్‌ఎస్‌కు మరింత ఇబ్బందికరంగా మారాయి. విరాళాల తగ్గుదల పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ వ్యయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

More Stories
తెలంగాణలో నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్
ఓ మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదు
కత్తితో దాడి చేసిన దొంగలపై ఐపీఎస్ కాల్పులు!