భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తున్న వందేమాతరం

భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తున్న వందేమాతరం

* తెలంగాణ యోధుడు ‘కొమురం భీం’ని కీర్తించిన ప్రధాని మోద

నవంబర్ 7న భారతదేశం ‘వందేమాతరం’ 150వ సంవత్సర వేడుకల్లోకి అడుగుపెడుతుందని చెబుతూ  ‘వందేమాతరం’కు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.  మన్‌కీ బాత్ 127వ ఎపిసోడ్‌లోఆదివారం ఆయన మాట్లాడుతూ బంకిం చంద్ర ఛటర్జీ స్వరపరిచిన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’కు నివాళులు అర్పిస్తూ, దేశ ప్రజల హృదయాల్లో భావోద్వేగాల ఉప్పెనను రేకెత్తిస్తుని పేర్కొన్నారు. ఈ పాటను రచించినందుకు బంకిం చంద్ర ఛటర్జీని ఆయన ప్రశంసించారు. 
 
“భూమి తల్లి, నేను ఆమె బిడ్డను అనే భావనతో వేదాలు భారతీయ నాగరికతకు పునాది వేశాయి. బంకించంద్ర ఛటోపాధ్యాయ ‘వందేమాతరం’ రాయడం ద్వారా మాతృభూమి, దాని పిల్లల మధ్య ఉన్న అదే సంబంధాన్ని భావోద్వేగాల విశ్వంలో ఒక మంత్రంగా ప్రతిష్టించారు” అని ప్రధాని మోదీ తెలిపారు.
 
అక్టోబర్ 31న జరగనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతికి ముందు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఆయనను స్మరించుకున్నారు. మాజీ భారత ఉప ప్రధానమంత్రి “ఆధునిక కాలంలో దేశపు గొప్ప ప్రముఖులలో ఒకరు” అని కొనియాడారు. సర్దార్ పటేల్ పరిశుభ్రత, సుపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశాన్ని ఏకం చేయడానికి అసమానమైన ప్రయత్నాలు చేశారని ప్రధాని మోదీ గుర్తు చేశారు.
 
“అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ యూనిటీలో మీరందరూ పాల్గొనాలని, ఒంటరిగా కాకుండా ఇతరులతో కలిసి పాల్గొనాలని నేను కోరుతున్నాను” అని ఆయన పిలుపిచ్చారు.  గిరిజన నేత బిర్సా ముండాకు ప్రధాని మోదీ నివాళులు అర్పిస్తూ  సామాజిక కార్యకర్త బిర్సా ముండాకు నవంబర్ 15న భారతదేశం ‘జనజాతీయ గౌరవ్ దివస్’ జరుపుకుంటుందని, ఆయన గురించి మరింత చదవాలని దేశ ప్రజలను ఆయన కోరారు.
 
“భగవాన్ బిర్సా ముండాకు నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజన సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి అసమానమైనది” అని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా  తెలంగాణ వీరుడు ‘కొమురం భీం’ను కూడా మోదీ కీర్తించారు. 20వ శతాబ్దం తొలినాళ్లలో దేశ ప్రజలకు స్వాతంత్ర్యం సుదూరస్వప్నంగా ఉండేదన్న మోదీ ఆ కాలంలో బ్రిటీష్‌వారి దోపిడీని గుర్తు చేశారు. 
 
అప్పట్లో తెలంగాణ, హైదరాబాద్‌ ప్రజలపై దమనకాండ తీవ్రంగా ఉండేదన్న మోదీ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై, బ్రిటీషర్ల అకృత్యాలపై 20 ఏళ్ల వయసులో కొమురం భీం ఉద్యమించాడని మోదీ చెప్పారు.  నిజాం పోలీసు అధికారిని కొమురం భీం చంపడమే కాకుండా, అరెస్ట్‌ కాకుండా తప్పించుకోగలిగారని కీర్తించారు. అసంఖ్యాక ప్రజల హృదయాల్లో, ముఖ్యంగా ఆదివాసీల మనస్సుల్లో కొమురం భీం సుస్థిరస్థానం సంపాదించారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. కొమురం భీం నుంచి యువత ఎంతో నేర్చుకోవాలని కూడా ప్రధాని మోదీ సూచించారు.

మోదీ మాట్లాడుతూ, “బ్రిటిష్ దోపిడీ, నిజాం అణచివేత పీక్ స్థాయిలో ఉన్న సమయంలో కేవలం 20 ఏళ్ల యువకుడు స్వగ్రామం, తన మనుషుల హక్కుల కోసం ధైర్యంగా నిలిబడ్డాడు. ప్రతిఘటనలో నిజాం అధికారిని కూడా హతమార్చి, పట్టుబడకుండా అడవుల్లో తన పోరాటాన్ని కొనసాగించాడు” అని తెలిపారు.  ఛత్ సందర్భంగా దేశ ప్రజలకు మోదీ  శుభాకాంక్షలు తెలిపారు.  ఈ పండుగ “సంస్కృతి, ప్రకృతి, సమాజపు లోతైన ఐక్యతను ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు. ఛత్ సమాజంలోని ప్రతి వర్గాన్ని ఏకం చేస్తుందని, ఇది భారతదేశ సామాజిక ఐక్యతకు ‘అందమైన ఉదాహరణ’ అని ఆయన తెలిపారు.
 
దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబులలో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని చెప్పారు. జీఎస్టీ మార్పులవల్ల ఈ సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని తెలిపారు. వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని రాసిన లేఖకు సానుకూల స్పందన వచ్చిందని ప్రధాని వెల్లడించారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్‌లో గార్బేజ్‌ కేఫ్‌ వినూత్నంగా పర్యావరణానికి సేవలు అందిస్తోందని తెలిపారు. “అక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇచ్చి ఫుల్‌ మీల్స్‌ తినొచ్చు. మీరు కిలో వ్యర్థాలు ఇస్తే లంచ్‌ లేదా డిన్నర్‌ ఏర్పాటు చేస్తారు. అదే అరకిలో ఇస్తే అల్పాహారం ఇస్తారు. ఈ కేఫ్‌ను అంబికాపూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్వహిస్తోంది” అని ప్రధాని అభినందించారు.