ఓలా, ఉబర్‌ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్‌ ట్యాక్సీ’

ఓలా, ఉబర్‌ సంస్థలకు పోటీగా కేంద్రం ‘భారత్‌ ట్యాక్సీ’
ప్రజా రవాణాలో రాజ్యమేలుతున్న ఓలా, ఉబర్‌ వంటి సంస్థలకు పోటీగా కేంద్రం భారత్ ట్యాక్సీని డ్రైవర్లకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌ కింద డిల్లీలో నవంబర్‌ నుంచి ఈ సేవలు ప్రారంభంకానున్నాయి.  మొదట భారత్ ట్యాక్సీ ద్వారా సొంతవాహనాలు కలిగిన 650 మంది డ్రైవర్లు దేశ రాజధానిలో ఈ సేవలు అందించనున్నారు. అనంతరం ఈ సేవలు ఇతర ప్రధాన నగరాలకు విస్తరించనుంది.
ప్రైవేట్‌ సంస్థల యాప్‌ అధారిత ట్యాక్సీ సర్వీసులపై కొన్ని ఏళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25 శాతం వరకు కమీషన్ తీసుకోవడంపై చాలా మంది డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటికీ సమాధానంగా కేంద్రం తీసుకువస్తున్న ఈ భారత్‌ ట్యాక్సీలో నమోదుకు డ్రైవర్లు ఎలాంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరంలేదు. మెంబర్‌షిప్‌ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 

ఈ సేవల ద్వారా డ్రైవర్లు తమ సంపాదనలో ఎక్కువ వాటాను నిలుపుకోవడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా 2026 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో తీసుకురావలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో దేశవ్యాప్తంగా దాదాపు 5000 మంది పురుష, మహిళా డ్రైవర్లను ఇందులో భాగస్వామ్యం చేయనుంది.

ముంబయి, పుణే, భోపాల్​, లఖ్​నవూ, జైపుర్​తో సహా 20 నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు 2030 నాటికి సుమారు లక్షమంది డ్రైవర్లను ఈ ప్లాట్​ఫామ్​లో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే భారత్​ టాక్సీ, ప్రైవేటు యాజమాన్యంలోని కార్పొరేషన్​గా కాకుండా సహకార సంస్థగా పనిచేస్తుంది. ఈ సేవలను సహకార్​ టాక్సీ కోఆపరేటీవ్​ లిమిటెడ్​ నిర్వహిస్తుంది.

ఈ సహకార్‌ ట్యాక్సీని గతంలోనే కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. సహకార సంఘాల మాదిరిగా ఇది పనిచేస్తుందని, ఇందులో నమోదు చేసుకున్న డ్రైవర్లకు మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. టూవీలర్‌, ఆటోలు, ఫోర్‌ వీలర్లు సహకార్‌ ట్యాక్సీలో భాగంగా సేవలందిస్తాయని ఆయన చెప్పారు. ఇందులోని లాభాలన్నీ ఏ ఒక్క కంపెనీకో పరిమితం కాకుండా డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు.

ఈ సేవను ఉపయోగించడం ఓలా, ఉబర్ యాప్‌ను ఉపయోగించినంత సులభం. ముందుగా ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి “భారత్ టాక్సీ” యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఐఫోన్ వినియోగదారులు ఆపిల్ స్టోర్ నుంచి దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉండనుంది.