దేశంలోనే కేరళ రాష్ట్రం అత్యంత ఆదర్శంతమైన లింగ నిష్పత్తిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని ఆమె సూచించారు. గత దశాబ్దకాలంలో లింగ ఆధారిత బడ్జెట్ కేటాయింపులు నాలుగున్నర రెట్లు పెరిగాయని ఆమె కొనియాడారు. 2011 నుండి 2024 మధ్య మహిళల నేతృత్వంలో ఎంఎస్ఎంఇలు దాదాపు రెట్టింపయ్యాయని చెప్పారు.
కొచ్చిలోని సెయింట్ థెరిసా కాలేజీ శతాబ్ది ఉత్సవాలకు శుక్రవారం ముర్ము హాజరవుతూ మహిళలు తమ అభిరుచిని, సామర్థ్యాలను వ్యక్తికరించడానికి అనువైన మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. మహిళా నేతల నేతృత్వంలోని సమాజం మరింత సమర్థవంతంగా పనిచేస్తూనే, మరింత మానవీయంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు.
మహిళలు స్పష్టతతో, ధైర్యంతో శ్రేష్టమైన జీవితాన్ని ఎంచుకోవాలని రాష్ట్రపతి సూచించారు. ఆధ్యాత్మిక విలువలకు దృఢ నిబద్ధతతో మహిళా విద్యను ప్రోత్సహిస్తున్న కళాశాల సామాజిక పరివర్తన, జాతీయ నిర్మాణానికి గొప్ప కృషి చేసిందని ఆమె మెచ్చుకున్నారు. ఈసంస్థను నిర్మించిన, శతాబ్దాల పాటు నిరంతర విజయాలు సాధించేందుకు నేతృత్వం వహించిన విశిష్ట వ్యక్తుల దార్శనికత, వారసత్వం ప్రశంసనీయమని ముర్ము కొనియాడారు.
కేరళకు చెందిన పలువురు మహిళలు దేశానికి నాయకత్వం వహించారని చెబుతూ 15 మంది అసాధారణ మహిళా సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణంలో గొప్ప దృక్పథాలను జోడించారని ఆమె గుర్తు చేశారు. ఆ 15మందిలో ముగ్గురు కేరళకు చెందినవారని చెప్పారు. అమ్ము స్వామినాథన్, అన్నీ మస్కరీన్, దాక్షాయణి వేలాయుదన్ ప్రాథమిక హక్కులు, సామాజిక న్యాయం, లింగ సమానత్వంతో పాటు అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలను ప్రభావితం చేశారని ఆమె తెలిపారు.
కేరళ మహిళలు సమర్థతకు గొప్ప ఉదాహరణగా నిలిచారని రాష్ట్రపతి అభినందించారు. భారతదేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ జస్టిస్ అన్నాచాందీ. 1956లో ఆమె కేరళ హైకోర్టు జడ్జీగా నియమితులయ్యారని ఆమె తెలిపారు. 1989లో భారత సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జీగా జస్టిస్ ఎం.ఫాతిమా బీవి చరిత్ర సృష్టించారని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, కేంద్ర మంత్రి సురేష్ గోపి సహా మంత్రులు పి.రాజీవ్, వి.ఎన్.వాసవన్, ఎంపి హిబిఈడెన్, ఎమ్మెల్యే టి.జె.వినోద్, కాలేజీ ప్రిన్సిపల్ అనుజోసెఫ్లు పాల్గొన్నారు. కాలేజీ శతాబ్ది ఉత్సవాల లోగోను కూడా రాష్ట్రపతి ఆవిష్కరించారు.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు