విశాఖపట్నంలో కంటైనర్ మెగా పోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో నీతి ఆయోగ్ సిఇఓ సుబ్రహ్మణ్యం గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుతీరంలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందున్నట్లు చెప్పారు.
కేంద్రం అమలు చేస్తున్న పూర్వోదయ పథకం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించిన ఆయన అందులో భాగంగానే విశాఖ గ్రోత్ హబ్ పైనా చర్చించారు. ఈ పథకం ద్వారా తీర ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అనేక ఓడరేవులు ఉన్నప్పటికీ వాటికి అదనంగా కంటైనర్ మెగా పోర్టును ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. త్వరలో జరగనున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో సమగ్రాభివృద్ధిపై చర్చ ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఇందుకోసం వినూత్న పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వీలుగా నివేదికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఇదే సమయంలో విశాఖ, అమరావతి, తిరుపతి గ్రోత్ కారిడార్ల ఏర్పాటు, దానివల్ల కలిగే ప్రయోజనాల పైనా సమీక్షించారు. సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ విశాఖ గ్రోత్ హబ్ పనుల వేగవంతానికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు వచ్చేలా నీతి ఆయోగ్ సిఫార్సులు చేయాలని సుబ్రహ్మణ్యంను కోరారు.
తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రా, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో అభివృద్ధికోసం పూర్వోదయ పథకాన్ని ఏర్పాటు చేశారు. సాంస్కృతిక వారసత్వం, సహజ వనరుల ను ఉపయోగించుకోవడం ద్వారా మౌళిక వసతుల ను సృష్టించుకోవడం, ఉపాధి అవకాశాలను పెంచు కోవడం, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించడం ఈ పథకం లక్ష్యాలు.
మౌళికాభివృద్ధిలో భాగంగా రహదారులు, వంతెనల నిర్మాణం, విమానాశ్రయాలు, ఓడరేవులు, విద్యుత్ ప్లాంట్లు వంటివి ఏర్పాటుచేస్తారు. ఈ భేటీలో నీతి ఆయోగ్ అదనపు సిఇఓ పార్థసారధిరెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి శశిధర్, ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్ చంద్, ప్రణాళికశాఖ సంయుక్త కార్యదర్శి అనంత్ శంకర్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు.

More Stories
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?
పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి
కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి