కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు బస్సు ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రం మొత్తాన్ని విచారంలో నింపింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
 
బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.

అలానే ఏపీ లోని కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ విపత్కర సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

మరోవైపు ఈ బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఏపీ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 
బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు. బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే.. హత్య నేరం కింద కేసులు పెట్టి లోపలేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, ప్రయాణికుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని సూచించారు. రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులని ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. దాని వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు.