వందేళ్లైనా జంగల్‌ రాజ్యాన్ని బిహార్‌ ప్రజలు మరిచిపోరు

వందేళ్లైనా జంగల్‌ రాజ్యాన్ని బిహార్‌ ప్రజలు మరిచిపోరు
 

విపక్షాలు చేసిన పాపాలను ఎంత దాచాలని చూసినా, జంగల్‌ రాజ్యాన్ని వందేళ్లైనా బిహార్‌ ప్రజలు మరిచిపోరని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి ఆడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని, జంగిల్‌ రాజ్యంలో జరిగిన ఆకృత్యాలను యువతకు వృద్ధులు చెప్పాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  బిహార్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యపరచాలని యువతకు మోదీ విజ్ఞప్తి చేశారు. 

విపక్షాల కూటమి గఠ్‌ బంధన్‌ కాదని, నేరస్థుల బంధన్‌ అని విమర్శించారు. విపక్ష కూటమిలో డిల్లీ, బిహార్‌లోని నేతలందరూ బెయిల్‌పై ఉన్నారని మోదీ దుయ్యబట్టారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయని, అందులో యువత ప్రముఖ పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.
 
“2014లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వచ్చాక బిహార్​లో అభివృద్ధి పనుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. విద్యుత్ సరఫరా చాలా మెరుగుపడింది. సరిపడా విద్యుత్​ ఉంటే పరిశ్రమలు, వ్యాపారం పెరిగి నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బిహార్​లోని ప్రతి రంగంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆస్పత్రులు, పాఠశాలలు నిర్మిస్తున్నారు. కొత్త రైల్వే మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి” అని తెలిపారు. 
 
వీటన్నింటికి ప్రధాన కారణం బిహార్​లో సుస్థిర ప్రభుత్వం ఉండడం అని పేర్కొంటూ స్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే అభివృద్ధి పుంజుకుంటుందని చెప్పారు. అనేక దశాబ్దాలుగా దేశంలో, బిహార్​లోని ప్రజలను నక్సలిజం ఇబ్బందులకు గురి చేసిందని, మావోయిస్టుల సాయంతో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు.  బిహార్​ అభివృద్ధిని అడ్డుకోవడంలో  నక్సలిజం కీలక పాత్ర పోషించిందని చెబుతూ పాఠశాలలు, కాలేజీలు, ఆస్పత్రులు తెరిచేందుకు నక్సలైట్లు అనుమతించలేదని, అప్పటికే ఉన్న వాటిని సైతం కూల్చివేశారని గుర్తు చేశారు.  
పరిశ్రమలు వచ్చేందుకు అనుమతించలేదని చెబుతూ  ఇలాంటి పరిస్థితుల నుంచి బిహార్​ను బయటకు తెచ్చేందుకు చాలా కష్టపడుతున్నామని తెలిపారు.  బిహార్​ను జంగిల్​ రాజ్​ అంధకారం నుంచి ఎన్​డీఏ బయటకు తెచ్చి అభివృద్ధి చేసిందని, నక్సలిజాన్ని అంతం చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ప్రధాని తెలిపారు.

 
బిహార్‌లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే మహిళ సాధికారతలో కొత్త యుగం ప్రారంభమవుతుందని ప్రధాని భరోసా ఇచ్చారు. జంగిల్ రాజ్​లో మహిళలను నాలుగు గోడల మధ్యలో ఉంచారని ఆరోపించారు. అందుకే వారిని అధికారం నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని చెప్పారు. తమ పాలనలో కోటి మందికి పైగా మహిళలు రూ. 10 వేలు అందుకుని వ్యాపారాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు.